ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆలయాల మంటలు చల్లారడం లేదు. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం, జగన్ పై ఆరోపణలు చేస్తున్న  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తన హయాంలో ఆయనను సీపీగా నియమించుకోలేదా అని ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ సీపీగా ఉన్నప్పుడు క్రిస్టియన్ కాదా చంద్రబాబు అని రోజా నిలదీశారు. ఇప్పుడున్న అధికారులంతా చంద్రబాబు హయాంలోనివారేనని, సీఎం జగనేమీ కొత్తగా తీసుకురాలేదని రోజా వివరించారు.


                తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనం అయ్యారని రోజా విమర్శించారు. ఇప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చారని, విజయవాడలో ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. బుద్ధిలేకుండా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మత రాజకీయాలు  చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అయ్యప్పమాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు దేవాలయాలు గురించి మాట్లాడం వింతగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే  రోజా వ్యాఖ్యానించారు.

                 సీఎం జగన్ కు కుల, మత పక్షపాత ధోరణులు అంటగట్టాలని చూస్తున్నారని, కానీ అన్నిమతాలకు చెందిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. హిందుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో ఎందుకు గుళ్లను కూల్చివేశారో చెప్పాలని రోజా నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ లో కుల, మత రాజకీయాలు పనిచేయలని రోజా స్పష్టం చేశారు. టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నికలో తగిన బుద్ది చెప్పబోతున్నారని రోజా చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: