వైఎస్ జగన్ సర్కారు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేయడంపై ఏపీలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతే కాదు.. ఏకంగా మత మార్పిడిల కోసమే ఈ ప్రయత్నమని విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను వైసీపీ నేతలు సమర్థం గా తిప్పికొడుతున్నారు. ఇవాళ ఎంతో మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా క్రిష్టియన్లా అని వారు ప్రశ్నిస్తున్నారు.

 

చంద్రబాబు కుసంస్కారంతో పని చేస్తున్నారని..అందుకే ఇంత చిన్న లాజిక్ మిస్సయ్యారని అంటున్నారు. పేదవాడి కోసం సంక్షేమ పథకాలు సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్నారని వైకాపా నేతలు చెబుతున్నారు. మాకు మాతృభాషాపై ఉన్న ప్రేమ మరెవరికీ లేదన్నారు. మతాలను, కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

గతంలో బీజేపీతో కలిసి పని చేసిన చంద్రబాబుకు ఇవన్నీ గుర్తుకు రాలేదని వైకాపా నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు మోదీపై విమర్శలు చేసి, కాంగ్రెస్‌తో కలిసి తిరిగిన చంద్రబాబు..ఈ రోజు ఓడిపోయిన వెంటనే మళ్లీ మోదీ కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోకపోతే ఇప్పుడు వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని హెచ్చరించారు.

 

రైతులకు పెట్టుబడి సాయం చేశామంటున్నారు వైసీపీ నేతలు . నిరుద్యోగులకు సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించామని చెప్పారు. మద్యం పాలసీ తెచ్చి పేదలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. ఆటో కార్మికులు, చేనేతలు, నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు ఇస్తున్నామని వివరించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు

మరింత సమాచారం తెలుసుకోండి: