ఇప్పుడు తెలుగు మీడియాలో స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే.. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అటు సినిమాలు బంద్.. ఇటు సీరియళ్లు బంద్.. టీవీ ఛానళ్లు వేసిన సీరియళ్లే మళ్లీ వేస్తున్నాయి.. పాతవీ గీతవీ అన్ని తిరగదోడుతున్నాయ్.. అటు సినిమా వాళ్లు కూడా అన్ని ఛానళ్లకూ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.. లాక్ డౌన్, కరోనాపై చెప్పాల్సింది చెప్పేశారు. వారు విసురుకునే బీద రియల్ మేన్ ఛాలెంజులూ బోర్ కొట్టేశాయి.

 

 

టీవీ చూడాలంటే బోర్.. ఫోన్ చూడాలంటే.. బోర్.. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో ఆ ఒక్క ప్రోగ్రామ్ కోసం మాత్రం జనం ఎదురు చూస్తున్నారు.. ఎగబడి చూస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా.. కేసీఆర్ లైవ్ ప్రెస్ మీట్.. అవును.. కాస్త ఎక్కువగా చెబుతున్నారని మీకు అనిపించినా అది వాస్తవం. కరోనా వచ్చినప్పటి నుంచి లాక్ డౌన్ ఆ తర్వాత పరిస్థితుల్లోనూ కేసీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ కేసీఆర్ ఫ్యాన్స్ పెరిగిపోయారు.

 

 

ఆ ఏదో చెబుతున్నామని అనుకుంటున్నారా.. కావాలంటే అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తాం. మంగళవారం తెలంగాణ కేబినెట్ జరిగింది. ఆ తర‌వాత కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఉంది. కానీ కేబినెట్ మీటింగ్ ఎప్పుడు ముగుస్తుందో.. ప్రెస్ మీట్ ఎప్పుడు స్టార్టవుతుందో తెలియదు. అందుకే టీవీ ఛానళ్ల తమ యూట్యూబ్ ఛానళ్లలో కేసీఆర్ ప్రెస్ మీట్ అంటూ ఓ థంబ్ నెయిల్ ఇచ్చేసి లింకులు ఇచ్చి కూర్చున్నాయి.

 

 

అంతే.. అప్పటి నుంచే జనం యూట్యూబుల్లో కేసీఆర్ లైవ్ ఎప్పుడు వస్తుందా అని ఆన్ చేస కూర్చున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచే లైవ్ లింకును వేల మంది చూస్తున్నారు. అంటే ప్రెస్ మీట్ ప్రారంభం కాకముందే ఓ ఛానల్ లింకును 40 నుంచి 50 వేలమంది చూస్తున్నారు. పక్కన కామెంట్లు పెడుతున్నారు. ఇక లైవ్ ప్రారంభమయ్యాక.. టీవీ ఛానల్ యూట్యూబ్ లైవ్‌ను ఏకంగా 2 లక్షల మంది వరకూ చూశారంటే.. కేసీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

వీ6 లైవ్ ను రెండు లక్షల మంది చూశారు.. టీవీ9 కూడా అంతకుమించే.. ఇలా టాప్ ఛానళ్ల లైవుల ద్వారా కనీసం 10 లక్షల మంది చూసి ఉంటారు..ఇక ప్రత్యక్షంగా టీవీల్లో చూసిన వారి సంఖ్య ఎంత ఉంటుంది.. బాబోయ్... కేసీఆర్.. ఏంటీ ఫాలోయింగ్.. ప్రజలపై ఏం మత్తు జల్లావు నాయకా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: