గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా...ఇదే ఆ నియోజకవర్గంలో వైసీపీ కేడర్, కొడాలి అభిమానుల నినాదం. కొడాలి నాని పోటీలో దిగకముందు వరకు గుడివాడ టీడీపీ కంచుకోటగా ఉండేది. కొడాలి నాని సైతం టీడీపీ నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నాని వైసీపీలోకి వెళ్ళాక పరిస్తితి మారింది. నాని వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచేశారు.

2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులని మట్టికరిపించారు. ఇలా నాని వరుసగా నాలుగుసార్లు గెలిచి, గుడివాడని తన సొంత అడ్డాగా మార్చేసుకున్నారు. అందుకే ఇక్కడ టీడీపీ నానీకి చెక్ పెట్టలేకపోతుంది. అభ్యర్ధులని మార్చినా సరే నాని విజయాలకు ఢోకా లేకుండా పోతుంది. పైగా ఇప్పుడు నాని మంత్రిగా ఉండటంతో ఇంకా బలపడ్డారు. అయితే నానీని ఓడించాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో నానిపై జనసేన కూడా గుర్రుగానే ఉంది.

ఈసారి చెక్ పెట్టాలని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. అయితే టీడీపీకి నానీని ఓడించడం చాలా కష్టం. కానీ జనసేన పోటీలో ఉండి ఓ 20 వేల ఓట్లు చీలిస్తే, టీడీపీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గుడివాడలో జనసేన అభ్యర్ధి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. దాని వల్ల ఓట్లలో ఎలాంటి చీలిక రాలేదు. అందుకే నానికి సైతం 18 వేల పైనే మెజారిటీ వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఒకవేళ పోటీలో ఉంటే నియోజకవర్గంలో మెజారిటీ కాపు ఓట్లు జనసేనకు పడేవి అని, దాంతో నాని గెలుపుపై ప్రభావం చూపి టీడీపీకి ప్లస్ అయ్యేది అని అంటున్నారు. ఎందుకంటే గుడివాడలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉండే కాపు ఓటర్లు టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. వీరు నాని వైపే ఉంటారు. అదే జనసేన కూడా పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయేవి. అది టీడీపీకి ప్లస్ అయ్యేది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో గుడివాడలో జనసేన పోటీలో ఉంటే నానికి చెక్ పెట్టొచ్చని టీడీపీ ఆశ పడుతుంది.

అయితే గుడివాడలో నానికి చెక్ పెట్టడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ పార్టీల వారీగా అభిమానులు ఎలా ఉంటారో...కొడాలికి కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. కాబట్టి పార్టీ తరుపున పడే ఓట్లు, సొంత ఇమేజ్‌తో పడే ఓట్లతో నాని గెలుపు ఆపడం కష్టం. ఏదేమైనా టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా కొడాలిని ఓడించడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: