పంచాయతీ ఎన్నికల్లో అవగాహన ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడిగా లాభపడినట్టు కొన్ని ప్రాంతాల్లో రుజువైంది. ఉమ్మడి శత్రువు వైసీపీని ఓడించడానికి లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు అభ్యర్థులు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే అనధికారిక పొత్తు పెట్టుకున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నాయకులు ఉమ్మడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓ అవగాహనకు వచ్చి గెలుపుకోసం కృషిచేస్తున్నారు. అయితే అధికార వైసీపీ ఈ పొత్తుపై మండిపడుతోంది. అపవిత్ర పొత్తు అంటూ విమర్శలు గుప్పిస్తోంది.

వాస్తవానికి బీజేపీ, జనసేన కూటమి పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే బీజేపీకి పెద్దగా సంస్థాగత బలం లేకపోవడంతో జనసేన ఆ పార్టీవైపు చూడలేదు. అటు బీజేపీ కూడా సొంతగా కొన్ని స్థానాల్లో పోటీకి దిగి సైలెంట్ అయింది. ఇటు జనసేన మాత్రం తమ సత్తా చూపిస్తామంటూ దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. అయితే అటు వైసీపీని, ఇటు టీడీపీని ఎదుర్కొని గెలిచేంత సత్తా జనసేనకు ఉందా అనేది అనుమానమే. అందుకే టీడీపీ సపోర్ట్ తీసుకుంది. అధిష్టానం స్థాయిలో పొత్తు నిర్ణయం జరక్కపోయినా స్థానికంగా ఎవరి అవకాశాల మేరకు వారు సయోధ్య కుదుర్చుకుని ముందుకెళ్తున్నారు.

ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట, టీడీపీ, జనసేన ఇరు పార్టీలకు ఇబ్బందిగా ఉన్నచోట.. ఇలా పొత్తులకు తెరలేచింది. అయితే ఈ పొత్తు కేవలం స్థానిక పోరుకే పరిమితమా లేక ముందు ముందు కొసనాగుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికయితే.. జనసేనతో పొత్తుకోసం టీడీపీ అధినాయకత్వం ఉబలాటపడొచ్చు కానీ, టీడీపీ దగ్గరకు వెళ్లేందుకు జనసేనాని మాత్రం ఉత్సాహంగా లేరు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వచ్చిన లాభం కూడా జనసేనకు అర్థం కావడంలేదు. ఈ దశలో బీజేపీతోనే ఉండాలా, లేక సొంతంగా పార్టీ బలం పెంచుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు జనసైనికులు, జన సేనాని. పేరుకు మిత్రపక్షాలుగానే ఉన్నా.. ఏపీలో ఏ పార్టీకాపార్టీ తమ సొంత బలం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: