మేకర్స్‌ హైవ్‌ఇన్నోవేషన్స్‌ సీఈఓ ప్రణవ్ వెంపటి ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. తెలివైన టాప్ యువ వ్యాపార వేత్తలలో మన తెలుగు తేజం స్థానం సంపాదించుకోవడం నిజంగా గర్వించదగిన విషయం. ఆయన స్థాపించిన మేకర్స్‌ హైవ్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ కృత్రిమ చేతులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ ‘కల్‌ ఆర్మ్‌’ అనే పేరుతో బయోనిక్‌ హ్యాండ్‌ తయారు చేసి, మూడున్నర లక్షల రూపాయలకు విక్రయిస్తోంది. ఈ ధర విదేశీ కంపెనీలు విక్రయించే బయోనిక్‌ హ్యాండ్‌ ధరతో పోలిస్తే చాలా తక్కువ.

హైవ్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ సహాయంతో ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వారు.. తమ శరీరానికి తగ్గట్టుగా బయోనిక్ హ్యాండ్ తయారు చేయించుకోవచ్చు. త్రీ డి స్కాన్ తో శరీరానికి తగినట్టుగా బయోనిక్ హ్యాండ్ తయారు చేస్తుంది కంపెనీ. ఈ బయోనిక్ హ్యాండ్ వివిధ ఫిజికల్ ఫోర్స్ లతో 15 కంటే ఎక్కువ పనులను చేయగలదు. రోజువారీ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి బయోనిక్ హ్యాండ్ చాలా బాగా సహాయపడుతుంది. పేరుకు తగ్గట్టుగానే వినియోగదారులు చేతులతో పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి శరీరంలోని నరాలలో విడుదలయ్యే విద్యుత్ ఉత్తేజములను బయోనిక్ హ్యాండ్ ట్రాక్ చేస్తుంది. దీనివల్ల సహజమైన చెయ్యి వలె బయోనిక్ హ్యాండ్ పనిచేస్తుంది.

అయితే ఈ కంపెనీ సీఈఓ ప్రణవ్ వెంపటి.. ఎన్జీవో, గవర్నమెంట్, ఆస్పత్రుల తో పాట్నర్షిప్ పెట్టుకోవాలని యోచిస్తున్నారు. ఇటీవల హైవ్‌ఇన్నోవేషన్స్‌ కంపెనీ స్టార్‌ఫిష్‌ గ్రోత్‌ పార్టనర్స్‌తో పాటు మరికొన్ని పెట్టుబడి సంస్థల నుంచి సుమారు రూ.65 కోట్లు సమీకరించింది. కరోనా కారణంగా కొన్ని పరికరాలు దొరకడం కష్టం అయిందని.. కొద్ది నెలలలో కరోనా తగ్గుముఖం పడితే ఆర్డర్ ఇచ్చిన వారికి హ్యాండ్స్ తయారుచేసి పంపిణీ చేస్తామని ప్రణవ్ వెంపటి చెప్పుకొచ్చారు. 2018 లో ప్రారంభమైన ఈ సంస్థ గత ఏడాది డిసెంబర్ నెలలో లాంచ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: