ఏపీలో టీడీపీ కార్యాలయాలపై ఒక్కసారిగా దాడులు జరగడంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలో పడ్డారు. కేంద్రంతో ఎప్పటి నుంచో పొత్తుకు ప్రయత్నిస్తున్నా.. ఫలించకపోవడంతో ఇప్పుడు మరోదారిని ఎంచుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని.. తాము మీతోనే ఉన్నామన్న సంకేతాలు పంపేలా ప్రయత్నించారు. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ అగ్రనేతలు కూడా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఈ నేపథ్యంలో కొందరు ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. అవసరం కోసమే చంద్రబాబు బీజేపీ దగ్గరకు వచ్చారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడుల విషయంలో కేంద్రం స్పందించాలని బాబు కోరడంతో.. జీవీఎల్ కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవాలని చంద్రబాబుపై ఒంటికాలిపై లేచారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. కేంద్రంతో ఎలా వ్యవహరించారో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. అసలు ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదని కూడా అప్పట్లో బాబు.. కేంద్రాన్ని అన్నారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడెలా కేంద్రం సహాయం కోరతారని ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబు హయాంలో ఏపీలో సీబీఐని కూడా అడుగుపెట్టనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేంద్రబలగాల సహాయం కోరడం విడ్డూరంగా ఉందని కూడా జీవీఎల్ అన్నారు. అసలు ఏ ముఖం పెట్టుకొని కేంద్రంలోని పెద్దలని కలుస్తారని ఫైర్ అయ్యారు. అప్పటి చంద్రబాబు మాటలను.. తామింకా మరచిపోలేదని కూడా చెప్పారు. ఇప్పటికైనా అప్పట్లో చేసిన తప్పులను.. చంద్రబాబు ఒప్పుకోవాలని.. కేంద్రానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు, మాటల తూటాలు పేలుస్తుంటే.. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా బాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: