వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారా..? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడు విజయసాయి రెడ్డి. వీరిద్దరూ కలిసి ఉంటే ఎంత పెద్ద నేతనైనా, ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే డీల్ చేస్తారు. మరి అలాంటి వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డట్టు గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో అందరూ ఇవన్నీ రూమర్స్ అని తోసిపుచ్చారు.

 

కానీ, విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో సీఎం జగన్ వైజాగ్ వెళ్తూ ఆయన కారు నుంచి సాయిరెడ్డిని దించటంతో కొన్ని అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో ప్రోటోకాలే దానికి కారణం అని క్లారిటీ వచ్చినా.. నాటి నుంచీ విజయసాయి వ్యవహారంపై రకరకాల వార్తలొస్తున్నాయి. అనంతరం ఎవరూ అడగకుండానే… ప్రాణం పోయే వరకూ జగన్ తోనే అని సాయిరెడ్డి ప్రకటించడంతో నిజంగానే వీరి మధ్య ఏదో జరిగింది అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో మరోసారి విజయసాయికి సీఎం జగన్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వైకాపా తరుపున విజయసాయి ఇప్పటి వరకు పార్లమెంటరి పార్టీ నేతగా ఉన్నారు.

 

ఇప్పుడు నలుగురు కొత్త రాజ్యసభ సభ్యులు కూడా వచ్చి చేరారు. ఈ తరుణంలో జగన్ కి అత్యంత నమ్మకస్తుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభలో అడుగు పెట్టారు. దాంతో… ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కి పార్లమెంటరి పార్టీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీలో పదవులు అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తున్నారని విమర్శలొస్తున్న తరుణంలో… ఇప్పుడు ఆ అపవాదను చేరిపేసుకునే పనుల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఈ కీలకపదవి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే.. విజయసాయి రెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: