
ఇంకా చెప్పాలంటే టీఆర్‌ఎస్‌లో తెలంగాణ ఫ్లేవర్‌ను కోల్పోవటం, జాతీయపార్టీ విషయంలోనూ గడియకో మాట, దేశంలో ప్రతిపక్షకూటమి పేరుతో నాలుగు రాష్ట్రాలు తిరగటం, మళ్లీ కొంతకాలం మౌనంగా ఉండటం, అవినీతిపరులైన పార్టీ నాయకులను వెనకేసుకుని రావటం, బీజేపీ విషయంలో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని జనం నమ్మటం, తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు నిలవగా ఆ యువతకి ఉద్యోగాల కల్పనలో విఫలం కావడం కూడా కారణాలు.
దీనికి తోడు ఇంటర్ లీకేజీ, టీఎస్‌పీఎస్‌సీ లీకేజి వంటి వాటితో యువతలో వ్యతిరేకత, 2014లో గెలిచినప్పుడు ఉద్యోగులకు వరాలు, రెండోసారి నిర్లక్ష్యం చేయటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు డ్యామేజీ, ఉద్యమపార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకోవటం, తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరించటం కూడా కారణాలే.
వీటికి అదనంగా ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయటం, ఉద్యమ గని సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత, మీడియా, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పట్ల నిరంకుశ వైఖరి ఇష్టపడని ప్రజలు, 2014లో టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫిరాయింపులు, 2018లో సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి తెరాసలో మరల ఫిరాయింపులు, అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్నే తెరాసలో చేర్చేసుకోవటం కూడా బీఆర్‌ఎస్ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు.