మహానటి సినిమా రిలీజ్ తరువాత కీర్తి సురేష్ కు డిమాండ్ బాగా పెరిగింది. తెలుగులో ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టె ఆలోచనలో కీర్తి సురేష్ ఉన్నట్టుగా సమాచారం. ఇలాంటి సినిమాల్లో నటించడం వలన డబ్బు వస్తుందేమో గాని పేరు రాదు. కాబట్టి తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలు ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నది.
ప్రస్తుతం తెలుగులో సోలో హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నది. కొత్త దర్శకుడుతో మహేష్ కోనేరు నిర్మాతగా వస్తున్న సినిమా ఇది. షూటింగ్ చాలావరకు పూర్తయింది. దీంతో పాటు ఈ అమ్మడు తమిళంలో కూడా డెబ్యూ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది. అదికూడా సోలో హీరోయిన్ మూవీ అని తెలుస్తోంది.
అటు బాలీవుడ్ లో బోనికపూర్ నిర్మిస్తున్న సినిమాలో కూడా చేసేందుకు సిద్ధం అయ్యింది కీర్తి సురేష్. ఇక మహానటి సినిమాకు ఉత్తమ చిత్రంగా, కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు సోలో హీరోయిన్ గా సినిమాలు చేసి విజయం సాధించిన వాళ్ళుగా తమిళంలో నయనతార, తెలుగులో సమంత ఉన్నారు.
వీరిద్దర్నీ కీర్తి సురేష్ ఫాలో అవుతున్నది. ఎలాగైనా వారిలా సోలో సినిమాలు చేసి విజయం సాధించాలని చూస్తోంది. సోలో హీరోయిన్ గా చేసి విజయం సాధిస్తే వచ్చే ఆ పేరు వేరుగా ఉంటుంది. పైగా ఇప్పుడు హీరో హీరోయిన్లు ఎవరు అని కాకుండా కంటెంట్ ఎలా ఉన్నది అని చూస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు కాబట్టే.. నయనతార తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.