గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీడీపీ నాయ‌కుడు.. మ‌ద్దాలి గిరిధ‌ర్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. టీడీపీ త‌ర‌ఫున తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న వైశ్య సామాజిక వ‌ర్గం నేత‌ను ఆ సామాజిక వ‌ర్గం దూరం పెట్టింది. అదే స‌మ‌యంలో అధికార పార్టీ కూడా  ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌మ్ముకున్న మంత్రి, పార్టీ మారేలా (టెక్నిక‌ల్‌గా టీడీపీనే)  ప్రోత్స‌హించిన మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ కూడా ఇప్పుడు గిరి ఫోన్ చేస్తే.. బిజీ అని పెట్టేస్తున్నార‌ట‌. దీంతో అస‌లు ఎమ్మెల్యే ప‌రిస్థితి ఎందుకు ఇలా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గిరి ఎట్ట‌కేల‌కు అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నిక‌ల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన గిరి ఈ సారి ప‌శ్చిమం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణులు ఇప్ప‌టికీ.. లేళ్ల అప్పిరెడ్డి మాటే వింటున్నారు. అడ‌పాద‌డ‌పా.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన చంద్ర‌గిరి ఏసుర‌త్నం మాట చెల్లుబాటు అవుతోంది. పైగా ఆయ‌న‌కు కీల‌క‌మైన మిర్చి యార్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో మ‌రింత స్ట్రాంగ్ అయ్యారు. దీంతో గిరి మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా వైసీపీ విధానాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెల్ల‌డంలోనూ గిరి యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గిరి టీడీపీని వీడి వైసీపీకి ఆయ‌న మ‌ద్ద‌తు దారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. టీడీపీ శ్రేణుల‌ను నియంత్రించి, పార్టీలోనే కొన‌సాగేలా.. నాటి ఉమ్మ‌డి జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు స‌క్సెస్ అయ్యారు. దీంతో గిరి ఏదైనా కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా.. వైసీపీ నాయ‌కుల‌ను, శ్రేణుల‌ను తీసుకువెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌న అనుచ‌రులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం గిరి కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం లేదు. దీంతో గిరి మౌనంగా ఉంటున్నారు. ఇదే విష‌యంలో మంత్రి వెలంప‌ల్లికి, గిరికి మ‌ధ్య చిన్న‌పాటి మాట మాటా కూడా వ‌చ్చింద‌ని తెలిసింది. నువ్వు రావ‌డం కాదు.. నీ వెంట వ‌చ్చేవారిని కూడా క‌లుపుకొనిపోవాలి.. అని వెలంప‌ల్లి సూచించారు. అయితే.. ఎవ‌రూ రాన‌ప్పుడు నేనేం చేయ‌ను.. అని గిరి అన్నార‌ట‌. దీంతో మంత్రి త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు.

మ‌రోవైపు లేళ్ల అప్పిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టికెట్ త్యాగం చేశారు. కానీ, త‌న త్యాగానికి ప‌లితం ద‌క్క‌లేద‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. ఇదే విష‌యంలో ఆయ‌న పార్టీ స‌ల‌హాదారు, కీల‌క నాయ‌కులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ప‌లుమార్లు విన్న‌వించ‌డంతో.. నీప‌ని నువ్వు చేసుకో.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు నీకే ఇచ్చే అవ‌కాశం ఉంది.. అన‌డంతో లేళ్ల దూకుడు పెంచారు. పైగా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న‌కు పార్టీ కేంద్ర కార్యాల‌య నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక జిల్లాలో మెజార్టీ వైసీపీ వాళ్లు అప్పిరెడ్డి కంట్ర‌ల్లో ఉంటున్నారు. ఫ‌లితంగా గిరి ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. పార్టీ మారినా.. ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేద‌ని గిరి మ‌ద‌‌న ప‌డుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: