కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇవాళే ప్రచారానికి ఆఖరి రోజు. ఇప్పటికే రెండు, మూడు రోజులుగా  అభ్యర్థులు, నాయకులు, పార్టీల శ్రేణులు జోరు పెంచేశాయి. ఓవైపు ఎండలు మండిస్తున్నా ఇంటింటి ప్రచారం జోరు పెంచేశారు. అయితే విజయనగరం కార్పొరేషన్‌లో స్వతంత్ర్యులు ప్రధాన పార్టీల అభ్యర్థు గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఇండిపెండెంట్లు ఎవరో కాదు.. స్వయంగా వైసీపీ టికెట్‌ రాని ఆ పార్టీ నేతలే.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా.. వీరిలో చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే రేంజ్‌లో ఓట్లు తెచ్చుకోగల సమర్థులే. మరి వీరి ఎవరికి చేటు తెస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కొన్ని వార్డుల్లో కనిపిస్తోంది. సుమారు 15 వార్డుల్లో వైసీపీకి చెందిన నాయకులు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు స్వతంత్రులుగా పోటీలో ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఉంది. అయా వార్డుల్లో ఉన్న పరిచయాలు.. ఇంతవరకు చేపట్టిన కార్యక్రమాల ద్వారా వారు ప్రజల్లో ఉన్నారు. అందుకే ఆయా వార్డుల్లో గట్టి పోటీ ఇస్తున్నారు.

అధికార పార్టీలో గ్రూపుల గొడవ చాలా ఎక్కువగా ఉంది. ఈ వైసీపీలోని గ్రూపుల కారణంగానే రెబల్‌ అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో నిలిచారు. ఇది ఎవరికి మేలు చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రూపుల గొడవ అధికార పార్టీకి నష్టం తెస్తుందా!.. ప్రతిపక్ష టీడీపీకి మేలు చేస్తుందా! అనేది ఎన్నికలు ముగిస్తే కానీ తెలియదు. అయితే..  కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు మంచి మద్దతు లభిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఓ వైపు ప్రచారం ముగుస్తుండటంతో మరోవైపు ప్రలోభాల వ్యవహారానికి కూడా పార్టీలు సిద్ధమవుతున్నాయి. వార్డు పరిధిలో తాయిలాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మద్యం మత్తులో ముంచుతున్న అభ్యర్థులు చివరి దశలో డబ్బు పంపిణీకి సైతం బాగానే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి విజయనగరం కోటపై జెండా ఎగెరేసేదెవరో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: