
తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తొలిసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం అసెంబ్లీ సమావేశంపై నిర్ణయం తీసుకోగా అర్ధరాత్రి ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌజ్ లో మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి పడ్డారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేసిన వైద్యులు పాదం వద్ద ఫ్యాక్చర్ అయినట్లు తెలిపారు. తర్వాత సర్జరీ చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా జాలి చూపాల్సిన పలువురు కార్యకర్తలు అత్యుత్సాహం చూపుతున్నారు. ఆయన వైఖరి నచ్చకుంటే విమర్శించాలి. అంతేకానీ కష్టాల్లో ఉన్న సమయంలో అవహేళన చేసి మాట్లాడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కేసీఆర్ అధికారం కోల్పోవడంతో తీవ్రంగా మదన పడుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో అతిగా మద్యం తాగి జారిపడి ఉంటారని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. కొందరేమో అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రమాణం చేయాల్సి ఉంటుందని.. ఈ సమయంలో ఎదురుపడే సీఎం రేవంత్ రెడ్డి నమస్కారం చేయాల్సి ఉంటుందనే కాలుజారిన డ్రామాలు మొదలు పెట్టారని అంటున్నారు. మరికొందరు ఏకంగా ఇదంతా పీకే డైరక్షన్ లో నే జరుగుతుంది అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ స్వతాహాగా ఎదిగిన నేత. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఆయన గురించి ఈ తరహా పోస్టులు పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.