
ఇటీవల పంజాబ్ లో కూడా ఈ తరహా బీజేపీ పొత్తులు వెలుగు చూశాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తో బీజేపీ ఏడు దఫాలుగా చర్చలకు ఉపక్రమించింది. అనంతరం ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల కోసం పంజాబ్ లోక్ కాంగ్రెస్ తో బీజేపీ జట్టు కట్టేసింది. దీనితో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలలో మార్పులు చోటుచేసుకోక తప్పడం లేదు. అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే అమరీందర్ సింగ్ పంజాబ్ బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. గెలుపు లక్ష్యంగా వీళ్ళమధ్య ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తుంది. దీనికోసం వాళ్ళ మధ్య ఏడు రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయం ఇంకా కొలిక్కి రాకపోవడంతో, దానిపై త్వరలో ఒక స్పష్టతకు రానున్నారు.
ఈ సందర్భంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, సుదీర్ఘ చర్చల తరువాత కలిసిపోటి చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. నూటికి నూరు శాతం పంజాబ్ లో గెలిచితీరుతాము. సీట్ల విషయంలో కూడా ఆయా ప్రాంతాలలో పరిస్థితులు ఏమిటి, ఎవరు అక్కడ నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూలంకుషంగా పరిశీలించి నిర్ణయిస్తామని తెలిపారు. ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.