త్వరలోనే డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామంటూ వైసీపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కొన్ని కోర్టు సమస్యలు ఉన్నాయని.. అవి క్లియర్ కాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామమని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

 

 

సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర కార్యాలయంలో మన బడి నాడు నేడు కార్యక్రమంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే పరికరాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

 

 

మన బడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ తెలిపారు. మరుగు దొడ్లు, టేబుల్స్, తాగునీరు, ప్రహరీగోడలు వంటి తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కావాల్సిన పరికరాలకు టెండర్‌ ప్రక్రియ ఖరారు చేశామని మంత్రి వెల్లడించారు.

 

 

ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చాక అనేక నోటిఫికేషన్లు ఇచ్చారు. దాదాపు 4 లక్షల వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రత్యేకంగా గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ సర్కారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా ఈ ఉద్యోగాలు ఇచ్చింది. ఇవే కాకుండా మరికొన్ని నోటిఫికేషన్లు కూడా జగన్ సర్కారు ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: