నాదెండ్ల మనోహర్...ఉమ్మడి అంధప్రదేశ్ చివరి అసెంబ్లీ స్పీకర్. అలాగే మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు. చాలా ఏళ్ళు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన భాస్కరరావు, ఎన్టీఆర్ టీడీపీ పెట్టాక ఏం చేశారో కూడా తెలుసు. చంద్రబాబు కంటే ముందు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం ఎక్కారు. కానీ తర్వాత ఎన్టీఆర్ పొరాడి నాదెండ్లని గద్దె దింపి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యారు.


ఇక తర్వాత భాస్కరరావు కాంగ్రెస్‌లోకి వచ్చి కొన్నేళ్లు ఆ పార్టీలో పని చేసి, తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అయితే భాస్కరరావు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన నాదెండ్ల మనోహర్ ఎప్పుడు వివాదరహితుడుగానే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున తెనాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా పనిచేశారు. ఈయన స్పీకర్‌గా ఉండగానే రాష్ట్రం విడిపోయింది.


అయితే రాష్ట్రం విడిపోయాక నాదెండ్ల కొన్నిరోజులు రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పెట్టిన జనసేనలో చేరి ఆ పార్టీలో కీలకంగా మారారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన తరుపున మరోసారి తెనాలిలో పోటీ చేశారు. కానీ తెనాలిలో వైసీపీ-టీడీపీల మధ్య పోటీ నడిచింది. టీడీపీపై వైసీపీ గెలిచింది. కానీ నాదెండ్ల జనసేన తరుపున పోటీ చేసి దాదాపు 30 వేల ఓట్లు తెచ్చుకుని, మూడో స్థానానికి పరిమితమయ్యారు.


అటు రాష్ట్ర స్థాయిలో జనసేన దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. అయినా సరే మనోహర్ జనసేన తరుపున ఇంకా గట్టిగా కష్టపడుతున్నారు. ప్రతి విషయంలోనూ పవన్‌కు సపోర్ట్‌గా ఉంటున్నారు. ఇలా పవన్‌కు అండగా ఉండే మనోహర్‌కు వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే ప్రస్తుతం పరిస్థితులని చూస్తే లేదనే చెప్పొచ్చు.  ప్రస్తుతం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది. అయినా సరే నాదెండ్లకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన, టీడీపీలు పొత్తు పెట్టుకుంటే మనోహర్‌కు ఛాన్స్ ఉంటుంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: