ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారమై తర్జనభర్జనలు చేస్తుండగా.. మరోవైపు పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. గంటా శ్రీనివాసరావు టీడీపీ కీలక నేతల్లో ఆయన ఒకరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన కొత్త నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. అలానే 2019 విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకున్న టీడీపీ ఈసారి గంటాను చీపురుపల్లికి వెళ్లాలని సూచించింది.


అయితే విశాఖ జిల్లాను వదలడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు మరోస్థానం నుంచి పోటీ చేయమనడంపై ఆయన గరంగరం అవుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు మాత్రం ఈ సారి విశాఖ పట్నం నుంచే పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.  నేనే విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడం లేదు. అక్కడ వేరే ఇన్ ఛార్జిని పెట్టమన్నారు.


అలానే నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ ఆదేశించింది. కానీ అక్కడికి వెళ్లడంపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150 కి.మీ. దూరం. అంతేకాక వేరే జిల్లా కావడంతో నేనే ఆలోచనలో పడ్డాను అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలుతుందని.. మరో వారంలో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల్లో తన నిర్ణయం ఏంటో చెప్తానని చంద్రబాబుకి పరోక్ష హెచ్చరికలు పంపారు.


వాస్తవానికి గంటా బలమైన కాపు నేత. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు రికార్డు ఉంది. నియోజకవర్గాలు మార్చినా ఆయన గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. అయితే ఈ సారి పొత్తులో భాగంగా విశాఖ నార్త్ ను జనసేన కోరింది. దీనికి చంద్రబాబు కూడా సరే అన్నారని సమాచారం. దీని వెనుక మరో కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం చేయాలని తన అన్న చిరంజీవిపై ఒత్తిడి తెచ్చిన నేతల్లో గంటా ఒకరని పవన్ భావిస్తున్నారు. అందుకే పవన్ కు ఆయనంటే కోపం. ఈ కోణంలోనే ఆయన పోటీ చేసే స్థానం మార్చుతున్నారని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: