ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన వయస్సు కేవలం 50 సంవత్సరాలు.. రాజకీయాల్లో 50 ఏళ్లు అంటే యువకుడు కిందే లెక్క. అలాంటిది.. ఆయన అనూహ్యంగా గుండెపోటు కారణంగా మృతి చెందడం అందరినీ విషాదంలో నింపింది. అయితే.. ఆయన ఎలా చనిపోయారు.. అసలు చనిపోయే ముందు ఏం జరిగింది.. అన్నది ఓసారి పరిశీలిస్తే..


నిన్న గౌతమ్‌ రెడ్డిపెళ్లి వేడుకకు వెళ్లారట. రాత్రి ఆ వేడుక పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 9.45 అయ్యిందట. ఆ తర్వాత నిద్రపోయారు.. ఉదయం రోజూలాగే ఉదయం 6 గంటలకు  గౌతమ్‌ రెడ్డి మేల్కొన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉదయం 6.30 వరకు గౌతమ్‌ రెడ్డి ఇంట్లో వారితో మాట్లాడుతూనే ఉన్నారట. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు ఇంట్లోని సోఫాలో కూర్చున్నారట. ఆ తర్వాత ఉదయం 7 గంటల 12నిమిషాలకు డ్రైవర్‌ను పిలవమని గౌతమ్‌ రెడ్డి వంట మనిషికి చెప్పారట. తర్వాత డ్రైవర్‌ వచ్చేలోగానే 7:15 కు గుండెపోటుతో సోఫా నుంచి కిందకు ఒరిగిపోయారట.


ఉదయం 7:18 గంటలకు గౌతమ్‌రెడ్డి బాధ చూసి.. డ్రైవర్‌ ఛాతిపై చేతితో రుద్ది ఉపశమనం కలిగించారట. 7.20 గంటలకు గౌతమ్‌రెడ్డి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారట. ఏమైందని దగ్గరకు వచ్చి చూశారట. 7.20 గంటలకు మంచి నీరు కావాలని గౌతమ్‌రెడ్డి అడిగారట. మంచినీరు తెచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారట గౌతమ్‌రెడ్డి. దీంతో శ్రీకీర్తి వ్యక్తిగత సిబ్బందిని వెంటనే పిలిపించారట. నొప్పి పెడుతుంది కీర్తి అంటూనే మంత్రి కొద్దిసేపు ఇబ్బందిపడ్డారట.


వెంటనే ఆస్పత్రికి వెళదామని మంత్రి సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఉదయం 07.27 గంటలకు మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి ఉన్న 3 కి.మీ దూరాన్ని.. వేగంగా  5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చారట  మంత్రి మేకపాటి డ్రైవర్. ఉదయం 08:15 గంటల వరకూ పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని చెప్పిన అపోలో వైద్యులు.. 9.13 గంటలకు మంత్రి మేకపాటి మరణించారని నిర్థారించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: