- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో, కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ శిక్షణా కార్యక్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కవిత తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరమైందని వ్యాఖ్యానించడంతో పాటు, జాగృతిని రాజకీయ రంగంలోకి తీసుకురావాలన్న సంకేతాలు బలంగా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కవిత మాట్లాడుతూ, కాలానుగుణంగా జాగృతి తన పంథాను మార్చుకుంటోంది. సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంద‌న్నారు. గతంలో ముఖ్యంగా సాంస్కృతిక, విద్య, యువత అభివృద్ధి దిశగా పని చేసిన జాగృతి, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తమ ప్రభావాన్ని చూపేలా మారుతుందని ఆమె సంకేతాలిచ్చారు.


నాయకులు ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరని... నేర్చుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే నిజమైన నాయకత్వం వ‌స్తుంద‌ని ఆమె స్పష్టం చేశారు. భ‌విష్య‌త్తులో క‌విత కొత్త రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్నారా ? అన్న‌ట్టుగా ఆమె వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి గతంలో ఎలా ఉద్యమానికి అండగా నిలిచిందో కూడా గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఏకైక సంస్థ జాగృతే. ఎంతోమంది ప్రముఖులకు ఎదురుగా నిలిచి, తమ సిద్దాంతం కోసం పోరాడిన సంస్థ జాగృతి మాత్రమే అని ఆమె గర్వంగా చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణకు నష్టం చేసే ఏ నిర్ణయాన్నీ జాగృతి ఉపేక్షించదు. బనకచర్ల ప్రాజెక్టును ఆపేందుకు తెలంగాణ జాగృతి పోరాడుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు.  బీఆర్ఎస్ పార్టీ కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరానికి ప్రత్యామ్నాయంగా సమీప ప్రాంతంలోనే సమావేశం పెట్టడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా నిలిచింది.


ఉదయం హరీష్ రావు, సాయంత్రం కేటీఆర్ ప్రసంగించిన కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ కూడా తమ ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కవిత యువతతో నేరుగా మమేకమవుతుండటం, శిక్షణా కార్యక్రమాల ద్వారా భవిష్యత్ నాయకులను సిద్ధం చేయాలన్న ఆలోచన – ఇవన్నీ కలిపి చూస్తే, ఆమె తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మలచే దిశగా స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్నది అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మార్పులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులు తేవడం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: