
ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకున్నా, ఆమె పట్టుదల వెనుకడుగు వేయలేదు. ఈ ఉద్యమం ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో కనీసం చర్చకు వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్‌కి, షర్మిల ఇలా చురుకుగా వ్యవహరించడం ఒక కొత్త ఊపుని తెచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు, వైసీపీ పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. ప్రతిపక్షంగా 11 స్థానాలు గెలుచుకున్నా ఇప్పటి వరకు వైసీపీ రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు శ్రీకారం చుట్టలేదు. వైసీపీ ఎక్కువగా జిల్లాల స్థాయిలో నిరసనలు మాత్రమే నిర్వహిస్తున్నారు.
కానీ అవి పెద్దగా ప్రజాదరణ పొందకపోవడంతో, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయికి చేరుకోలేదు. ఫలితంగా, వైసీపీ అసెంబ్లీలోనూ, బయటా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. ఇక షర్మిల విషయానికి వస్తే, ఆమె ఇప్పటి వరకు జగన్‌ను ప్రధానంగా టార్గెట్ చేసి వచ్చినా, తాజాగా నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో మాత్రం ఆయన పేరు ప్రస్తావనకు రాలేదు. ఆమె వ్యూహం పూర్తిగా మారింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన లక్ష్యమని చూపించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ మార్పు వల్ల ప్రజలలో షర్మిలపై ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే, షర్మిల ప్రభుత్వంపై నేరుగా దాడి చేసి, ప్రజా సమస్యలను ఎత్తి చూపితే, కాంగ్రెస్‌కి కొత్త ఊపిరి లభిస్తుంది. అదే సమయంలో వైసీపీ నిష్క్రియాత్మకంగా ఉంటే, ప్రతిపక్ష స్థాయి లోనే కాదు, ప్రజల్లోనూ తమ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వైసీపీ ఇప్పటికైనా దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోతే షర్మిల జోరు ముందు వైసీపీ బేజారవ్వాల్సిందే.