2019 ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి వైసీపీ గెలుపు కోసం కష్టపడిన నేతలలో లక్ష్మీపార్వతి ఒకరు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి కీలక పదవి ఇచ్చింది. ఉన్నత విద్య అభ్యసించిన లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించింది. ఆమెకు నెలకు నాలుగు లక్షల రూపాయల జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
అయితే తాజాగా ఈమె పదవిని ఒక వివాదం చుట్టుముట్టింది. అసలు ఏపీలో తెలుగు అకాడమీ చైర్మన్ పదవే లేదని... ఆమెకు ఇప్పటివరకూ ఒక్క నెల జీతం కూడా అందలేదని సమాచారం. పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలైనా ఒక్క నెల జీతం కూడా అందకపోవడంతో ఆమె ప్రభుత్వ పెద్దలను సంప్రదించారు. ప్రభుత్వ పెద్దలు ఉన్నత విద్యాశాఖ ఆమెకు జీతం చెల్లిస్తుందని చెప్పి పంపారు. 
 
లక్ష్మీపార్వతి ఉన్నత విద్యాశాఖను సంప్రదించగా తాము జీతాలివ్వలేమని... తమ దగ్గర తెలుగు అకాడమీ విభాగమే లేదని వారు స్పష్టం చేశారు. ఏపీలో తెలుగు అకాడమీ చైర్మన్ పదవి లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని తెలుగు అకాడమీని ఇప్పటివరకూ విభజించలేదు. విభజన చట్టంలోని షెడ్యూల్ 10 ప్రకారం తెలుగు అకాడమీని విభజించి ఏపీకి అప్పగించిన తరువాత మాత్రమే చైర్మన్ ను నియమించాలి. కానీ ఏపీ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఏపీలో తెలుగు అకాడమీనే లేకపోతే... లక్ష్మీపార్వతి ఇంతకాలం తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవిలో ఏం చేశారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే పనిలో పడినట్లు సమాచారం. ఆమె నియామకం ఉత్తర్వులు ఇచ్చిన సాధారణ పరిపాలన శాఖ తాజాగా జీత భత్యాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం లేని పదవికి జీతాలు ఎలా చెల్లిస్తుందని కొందరు ప్రశిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: