“ఒక ఆడదానికి మరో ఆడదే శత్రువు” అన్న పాత సామెత ఈ మధ్యకాలంలో మరింతగా నిజమవుతోందని చెప్పొచ్చు. ప్రత్యేకించి సోషల్ మీడియా, ఆన్‌లైన్ బిజినెస్‌ల వృద్ధితో ఈ పోటీ మరింత బహిరంగంగా బయటపడుతోంది. నేటి రోజుల్లో చాలా మంది మహిళలు ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఛానెల్‌లు క్రియేట్ చేసి, తమదైన స్టైల్‌లో కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వంటకాలు, బ్యూటీ టిప్స్, లైఫ్‌స్టైల్ సజెషన్స్, కుట్టు పద్దతులు వంటి ఎన్నో విషయాలను పంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు.


అంతేకాదు, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్న డబ్బుతో సరిపెట్టుకోకుండా మరింత అభివృద్ధి సాధించడానికి కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్న మహిళలు కూడా ఉన్నారు.  ఎవరి కడుపు కొట్టకుండా నైతికంగా, నిజాయితీగా కష్టపడి ఎదగడం తప్పేం కాదు. కష్టపడి సంపాదిస్తే సమాజం ఎవరూ దానిపై వేలు చూపలేరు. అయితే, సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో జరుగుతున్న కామెంట్స్, ట్రోల్స్, విమర్శలు మాత్రం హద్దులు మీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలే మహిళలకు పోటీగా మారి ఒకరి బిజినెస్‌ను మరొకరు కించపరచడం అలవాటైపోయింది. ఉదాహరణకు, ఒక మహిళ చీరల ప్రమోషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటే, అదే ప్రొడక్ట్‌ని తీసుకుని మరో మహిళ ఆమె బిజినెస్‌ను డౌన్ చేయడానికి ప్రయత్నించడం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఒకరే ఇద్దరే కాదు, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలోనూ జరుగుతోంది.



ఇటీవల ఒక చీరల వివాదం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ‘ఒరిజినల్ వ్స్ రిప్లికా’ అనే ట్యాగ్‌తో ఈ ఇష్యూ విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియాను క్రమం తప్పకుండా ఫాలో అయ్యే మహిళలకు ఈ వివాదం బాగా తెలిసి ఉంటుంది. అసలు డిజైన్‌లను చూపిస్తూ రిప్లికా ప్రోడక్ట్‌లు అమ్ముతున్నారనే ఆరోపణలతో ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. “ఎవరి సామర్థ్యానికి తగినట్లుగా వాళ్లు చీరలు కొనుగోలు చేస్తారు” అంటూ కొందరు ఈ వాదనను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం “మహిళలే మహిళలకు శత్రువులుగా మారిపోయారు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.



ఒక మహిళ కష్టపడి, శ్రమించి సొంత బిజినెస్‌ను ప్రారంభించి విజయాన్ని సాధిస్తే, ఆ విజయం వెనుక ఎంతో కష్టం, త్యాగం ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ విజయాన్ని చూసి ఓర్చుకోలేక మరికొందరు కుల్లుతో ఆ మహిళను సోషల్ మీడియాలో కించపరచడం, నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేయడం చాలా సాధారణంగా మారిపోయింది. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో కొందరు కలబోసుకుని ప్రమోషన్ చేస్తూనే, అసలు ఫోటోలు చూపిస్తూ రిప్లికా ఉత్పత్తులు పంపుతున్నారని చాలా మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా ఘటనల కారణంగా ఇప్పటివరకు ఆన్లైన్ షాపింగ్‌కి ఎక్కువ ఆసక్తి చూపిన మహిళలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. “మనకి ఎందుకు  ఈ తలనొప్పులు? షాపుకే వెళ్లి మన కళ్లతో చూసి వస్తువులు కొనుక్కోవడమే మంచిది” అంటూ ఆన్లైన్ షాపింగ్‌ను తగ్గించే దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో “ఒరిజినల్ వ్స్ రిప్లికా” అనే ఈ వివాదం రోజురోజుకీ హీట్ పెంచేస్తోంది. ఈ ట్రెండ్‌తో పాటు ఆన్‌లైన్ బిజినెస్‌లపై నమ్మకం తగ్గిపోతుందనే ఆందోళన కూడా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: