హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలతో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆయన తాజాగా ‘బజార్ రౌడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతోంది. బజార్ రౌడీ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో సంపూర్ణేష్ బాబుకు ప్రమాదం సంభవించింది. ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోను పరిశీలిస్తే.. సంపూర్ణేష్ బాబు కొంత ఎత్తు నుంచి బైక్ పై వస్తుంటారు. బైక్‌ను పైకి లేపి రెండు సంచుల మధ్య నుంచి కిందకు దూకాల్సి ఉంది. అయితే.. ఇదే సమయంలో ఆయన అదుపు తప్పడం వల్ల కిందకు పడిపోయారు. తాడుతో బైక్‌ను దింపే సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు ఆయనను బైక్ నుంచి వెంటనే బయటకు లాగారు. ఈ ఘటనలో సంపూర్ణేష్ బాబుకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నగరు శివారులో షూటింగ్ జరుగుతోందని, శనివారం షూటింగ్‌లో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు యాక్షన్ సన్నివేశం చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు యూనిట్ సభ్యులు చెప్పారు.

ప్రస్తుతం కొద్ది రోజులు సంపూర్ణేష్ బాబు విశ్రాంతి తీసుకోనున్నారని, త్వరలోనే ఆయన మళ్లీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా.. బజార్ రౌడీ చిత్రానికి దర్వకత్వం వసంత నాగేశ్వర రావు వహిస్తున్నారు. నిర్మాతగా సందిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. హృదయ కాలేయం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి సంపూర్ణేష్ బాబు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత సింగం 123, కొబ్బరి మట్ట చిత్రాల్లోనూ సంపూర్ణేష్ బాబు ప్రధాన నాయకుడిగా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: