
- 2019 ప్రచారంలో ప్రస్తుత హోం మంత్రి అనితనే అడ్డుకున్న వైనం..!
- లెక్క తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం.. రాయుడు గుండెళ్లో రైళ్లు...!
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలోని ఓ మారుమూల గ్రామం చిక్కాల. ఈ గ్రామాన్ని నియోజకవర్గంలో కొందరు చిక్కులూరు అని పిలుచుకుంటూ ఉంటారు. కారణం ఈ గ్రామం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారకుడు ఓ చోటా వైసీపీ లీడర్. ఈ లీడర్ మూర్ఖపు ఆధిపత్య రాజకీయాలకు పరాకాష్ట. గ్రామంలో ప్రతి విషయంలోనూ తలదూర్చడం... డాంబికాలు పోవడం, ఏ పని చేయకపోయినా అందరిని తన చుట్టూ తిప్పించుకోవడం, తన మాట వినని వారిపై ఫాల్స్ కేసులు పెట్టించడం, ఎవరైనా భూకబ్జాలు చేసుకుని.. తనకు ఇవ్వాల్సింది ఇస్తే వాటిని ప్రోత్సహించడం, సారా బట్టీలను నడిపిస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడంలో ఆరితేరిపోయాడు.
కమీషన్ల కింగ్ :
ప్రతి పనిలోనూ భారీగా కమీషన్లు నొక్కేయడం.. నొక్కేసిన కమీషన్లు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు.. అప్పటి ప్రజాప్రతినిధులకు కొంత ముట్టుజెప్పి.. మిగిలింది తన జేబులో వేసుకోవడంలో దిట్ట. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు నాటి ప్రజాప్రతినిధి అండ చూసుకుని బాగా దందా నడిపించాడు. ప్రతి విషయంలోనూ తనకేం సంబంధం లేకుండా తలదూర్చి వారిలో ఓ వర్గాన్ని తిప్పుకుని అందినకాడకు దోచుకుని దాచుకోవడం ఆయన హాబీగా పెట్టుకున్నాడు. గులకరాల్ల క్వారీ అయినా.. అమాయక రైతుల భూముల్లో ఇసుక అయినా మాయమాటలతో దోచేస్తాడు. గ్రామంలో మానసిక వికలాంగులకు చెందిన భూములను కూడా కబ్జా చేసి అనుభవించడంలో ఇతడు దిట్ట. తనని మాట వినని వారిపై కొందరిని ఎగదోని.. వారిని భయబ్రాంతులకు గురి చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.
కబ్జా రాయుడు గుండెల్లో గుబేల్ :
2019 ఎన్నికల టైంలో నాటి రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూపతో పాటు నాటి కొవ్వూరు టీడీపీ అసెంబ్లీ, ప్రస్తుత హోం మంత్రి అయిన వంగలపూడి అనితను సైతం తన గ్రామానికి రాకుండా అడ్డుకున్న ఘనుడు ఈ మూర్ఖపు రాయుడు. ప్రస్తుతం నాటి విషయానికి సంబంధించిన ఫైలును కూటమి ప్రభుత్వం పైకి తీస్తుండడంతో ఈ అరాచక వాది బాధితులు కొందరు నారా లోకేష్, వంగలపూడి అనితను కలిసి తమకు అతడు చేసిన అన్యాయాలను ఏకరువు పెడుతూ న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ కబ్జా రాయుడిపై చర్యలు తీసుకునేందుకు హోం మంత్రి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుండడంతో ఇప్పుడు అతడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నాడు కబ్జా రాయుడు చేసిన అక్రమాలను బయటకు తీసి వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.