సత్తెనపల్లి తెలుగుదేశంపార్టీలో మంటలు మొదలయ్యాయి. నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబునాయుడు నియమించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎప్పుడైతే కన్నా నియామకాన్ని పార్టీ ప్రకటించిందో వెంటనే తమ్ముళ్ళు యాక్టివ్ అయిపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు కోడెల శివరామ్ తన మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకున్నారు. మద్దతుదారులతో సమావేశం తర్వాత రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తనకు టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని ప్రకటించారు.

మామూలుగా నియోజకవర్గానికి ఇన్చార్జంటే దాదాపు అభ్యర్ధనే అనుకోవాలి. ఇపుడు తాజా నియామకంతో రాబోయే ఎన్నికల్లో కన్నాయే అభ్యర్ధని పరోక్షంగా అందరికీ చెప్పినట్లయ్యింది. అందుకనే కోడెల శివరామ్ వెంటనే రియాక్టయ్యింది. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలపై కన్నా కన్నేసినట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి మూడునియోజకవర్గాల్లో తిరుగుతుంటే సమస్యలు తప్పవని అర్దమై చివరకు సత్తెనపల్లికే పరిమితమవుదామని అనుకున్నట్లున్నారు. అందుకనే సత్తెనపల్లికి ఇన్చార్జిగా ప్రకటించేశారు.


రాబోయే ఎన్నికల్లో ఈ  నియోజకవర్గంలో పోటీచేయాలని మాజీ ఎంఎల్ఏ జీవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి, రాయపాటి రంగారావు, కోడెల గట్టిగా ప్రయత్నించారు. అయితే లేటుగా పార్టీలో చేరినా లేటెస్టు వచ్చినట్లుగా కన్నాకే ఇన్చార్జి పదవి దక్కింది. దాంతో అందరికీ అర్ధమైపోయింది కన్నాయే అభ్యర్ధి అవుతారని.  మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకుని ఇపుడు కోడెల మాత్రమే బయటపడ్డారు. 

మరి మిగిలిన జీవీ ఆంజనేయులు, అబ్బూరి, రాయపాటి ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. మొదటినుండి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కొడుకు రంగారావుకు టికెట్ ఇప్పించుకోవాలని చాలా ప్రయత్నాలేచేశారు. కన్నాకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడగొడతామని కూడా వార్నింగిచ్చారు. అయితే చంద్రబాబు  వార్నింగును పట్టించుకోలేదు. మరి తాజా డెవలప్మెంట్లలో పై ముగ్గురు నేతలు ఏమిచేస్తారో చూడాలి. నియోజకవర్గంలో పార్టీలోనే ఉన్న ఇంతమంది ప్రత్యర్ధులను కాదని కన్నా ఎలా గెలుస్తారనే విషయం పెద్ద పజిల్లాగ తయారైంది. నిరాశలో ఉన్న తమ్ముళ్ళని చంద్రబాబునాయుడు పిలిపించుకుని మాట్లాడితే ఏమన్నా శాంతిస్తారేమో చూడాలి. లేకపోతే మాత్రం కన్నా గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: