కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత ప్రత్యేకత ఉంటుంది. సోమవారం శివునికి అత్యంత ఇష్టమైన రోజు. ఇక శివయ్యకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తులకు ఆనవాయితీ. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో... తెల్లవారు జాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున సమీపంలోని నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక దీపాలు వెలిగించి శివయ్యకు మొక్కులు చెల్లించారు. అలాగే నాగుల చవితి కూడా కావడంతో... పుట్టల వద్ద పూజలు చేసి దీపారాధన చేశారు. పుట్టలో పాలు పోసి నాగమయ్యకు నైవేద్యం సమర్పించారు. కార్తీక సోమవారం, నాగుల చవితి పండుగ ఒకే రోజు కావడంతో... తెల్లవారు జాము నుంచే అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీ తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక రాజమహేంద్రవరంలో భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానం చేశారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే పుష్కర ఘాట్ వద్ద భక్తుల సందడి మొదలైంది. గోదారమ్మకు దీపాలతో నైవేద్యం సమర్పించారు. నదీ తీరంలోని కైలాస నాథుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి నదీ తీరంలో ఉన్న శివాలయంలో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. విజయవాడలోని కృష్ణా నదిలోని పవిత్ర స్నానామచరించి... ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అటు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దివ్య క్షేతంలో తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సందడితో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: