ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరి దశ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ప్రచార సభలు ముగిసాయి. నిన్నటితో ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారణాసి లోని మీర్జాపూర్ నుంచి ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోడీ కూడా ఢమరు వాయించి ఆకట్టుకున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షో నగరం లోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన రోడ్ షో దక్షిణ అసెంబ్లీ మీదుగా కంటోన్మెంట్ లో ముగిసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

 ప్రధాని మోడీ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. రోడ్ షో సందర్భంగా వారణాసిలో ఓ వీధిలోని టీ దుకాణంలో ప్రధాని మోడీ చాయ్ తాగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మాజ్వది పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. అయితే పీఎం మోడీ నియోజకవర్గం లో అడుగడుగున ఆందోళనకారులు నల్లజెండాలతో మమతా పర్యటనను వ్యతిరేకించారు. నల్ల జెండాలను చూసి పశ్చిమ బెంగాల్ సీఎం తీవ్ర అసహనానికి గురై తన కారు ఆపి రోడ్డుపైకి వచ్చి నిరసనకారుల మధ్య లోకి వెళ్లారు. నల్లజెండాలతో ముందుకు రావాలని మమతా బెనర్జీ బిజెపి కార్యకర్తలను సూచించారు. ఇవి నల్లజెండాలు కావని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయం అని పేర్కొన్న మమతా బెనర్జీ మీరు ఎన్నికల్లో ఓడిపోతున్నారు అంటూ తేల్చి చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జై యూపీ,జై హింద్ అనే నినాదాలు చేశారు. ఆ పై ఆమెకు బిజెపి నిరసనకారులు నల్ల జెండాలు చూపించారు. వాటి మద్యే ఆమె తన ర్యాలీ కొనసాగించారు. మార్చి 7న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల్లో ఎస్పి,బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగిందని అంటున్నారు.చివరిదశతో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: