జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్న పార్టీ గుర్తు గాజుగ్లాసు జారిపోయింది. తాజాగా కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన ప్రకారం  ఏపీలో రెండుపార్టీలు వైసీపీ, టీడీపీలు మాత్రమే గుర్తింపుపొందిన పార్టీలు. గుర్తింపుపొందిన పార్టీలు కాబట్టే వాటి ఎన్నికల గుర్తులు వాటికి మాత్రమే రిజర్వయ్యాయి. అదే జనసేన పార్టీ కేవలం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. కేంద్ర ఎన్నికల కమీషన్ గుర్తింపు దక్కలేదు కాబట్టి ఆ పార్టీ చెప్పుకుంటున్న పార్టీ గుర్తు గాజుగ్లాసును కమీషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది.





అంటే కమీషన్ లెక్కల ప్రకారం పవన్ క్లైం చేసుకుంటున్న గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు ఎలాంటి అధికారంలేదు. ఎన్నికల సమయంలో ఎవరు ముందు నామినేషన్ వేస్తే వాళ్ళు గాజుగ్లాసు గుర్తును  తీసుకోవచ్చు. ఒకవేళ జనసేన అభ్యర్ధి నామినేషన్ వేసే సమయానికి గాజుగ్లాసు గుర్తును ఎవరికైనా కేటాయించుంటే  పార్టీ అభ్యర్ధి ఇంకేదైనా గుర్తుపైన పోటీచేయాల్సిందే. అంటే టెక్నికల్ గా చూస్తే గాజుగ్లాసు గుర్తు పవన్ చేజారిపోయినట్లు అర్ధమవుతోంది.





దీనివల్ల సమస్యలు ఏమిటంటే పవన్ తో కలిపి జనసేన అభ్యర్ధులందరు ఒకే గుర్తుమీద పోటీచేయటం సాధ్యంకాదు. పవన్ అయినా ఇంకెవరైనా జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేసేటపుడు ఒక్కో నియోజకవర్గంలో ఒక గుర్తుకు ఓట్లేయమని అడగాల్సుంటుంది. దానివల్ల ప్రచారం చేసేవాళ్ళకి చాలా ఇబ్బంది. ఎలాగంటే జనసేన తరపున ప్రచారం చేసేటపుడు  ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తును జనాలకు చెప్పాల్సుంటుంది.





రాజకీయపార్టీలకు ఎన్నికల గుర్తులు చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కాంగ్రెస్ పార్టీని జనాల్లో చాలామంది హస్తంపార్టీగానే గుర్తుంచుకుంటారు. టీడీపీ సైకిల్ పార్టీగానే పాపులర్. అలాగే వైసీపీ ఫ్యాన్ గుర్తుతోనే పాపులరైంది. ఇపుడు పవన్ గాజుగ్లాసును చూపిస్తున్న కారణంగా జనాలు ఆ గుర్తుమీద పోటీచేస్తున్న అభ్యర్ధులకు ఓట్లేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే గాజుగ్లాసుకు పడే ఓట్లన్నీ జనసేన తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులకు మైనస్సే అనటంలో  సందేహంలేదు. మరీ సమస్యనుండి పవన్ ఎప్పటికి బయటపడతారో ? గాజుగ్లాసు గుర్తు జనసేన అభ్యర్ధులకు ఎప్పుడు దక్కుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: