అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఒక్క సారి అధ్యక్షుడుగా ఎన్నికైతే ప్రపంచ దేశాలన్నిటికి  పెద్దన్నగా వచ్చే కీర్తి ప్రతిష్టలు, ఆ హంగు ఆర్భాటం, మామూలు విషయమా, అత్యధిక ధనిక దేశానికి అధినేతగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే అమెరికాలో నవంబర్ 3న జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఎన్నెన్నో సిత్రాలు కన్పిస్తున్నాయి. కరోనా కోరల్లో చిక్కుకుని అమెరికన్స్ అల్లాడి పోతుంటే రాజకీయ నేతల సహజశైలి ఈ సమయంలో కూడా బయటకి ఉబికి వస్తోంది. ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్, అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం జారవిడుచుకోరాదనీ ట్రంప్ హోరా హోరి పోరుకు సిద్దమయ్యిపోయారు. ఈ క్రమంలోనే బిడెన్ ఎన్నికల స్టంట్ చూస్తుంటే అమెరికా ప్రజలకి నవ్వు వస్తోందని ఎన్నికల ముందువరకూ కనపడని బిడెన్ ఎన్నికల సమయంలో వచ్చి  అమెరికా ప్రజలపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే నవ్వు వస్తోందని అంటున్నారు డెమోక్రటి పార్టీ నేతలు..


అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలో నిలిచిన బిడెన్ ప్రజల్ని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటి పోయిందని ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారని మరెంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని ఈ పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బిడెన్ వ్యాఖ్యానించారు. ప్రతీ రోజు చనిపోతున్న వ్యక్తుల కుటుంభాలు దిక్కు తోంచని పరిస్థితిలో ఉన్నాయని, ఈ మరణాల వల్ల సంభవిస్తున్న నష్టం ఎవరూ తీర్చేలేనిదని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం మాత్రం కోల్పోవద్దని, కరోనాతో పోరాటం చేయాలని అందుకు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని పిలుపు ఇచ్చారు..ఇలా ప్రజలు సలహాలు ఇస్తూనే పనిలో పనిగా అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డారు.


అమెరికా పౌరులు చనిపోతున్నా, ఆర్ధిక మూలాలు దెబ్బ తింటున్నా ట్రంప్ మాత్రం వీటిపై పెదవి విప్పడంలేదని, సాకులు, అబద్దాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ట్రంప్ లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అమెరికా ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండటానికి ట్రంప్ ప్రధాన కారణమని అన్నారు. ట్రంప్ కి అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఆరోపించారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా ప్రజలపై బాధని వెళ్లగక్కుతూనే ఎన్నికల్లో ఓట్లు వేయమని పరోక్షంగా అభ్యర్ధించారు. అయితే బిడెన్ మాపై  బాధని చూపించారా  లేక ఓట్ల కోసం అభ్యర్దించారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అమెరికన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: