ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ దుబాయ్ ను చూస్తుంటే అసూయ వేస్తోందని కామెంట్లు చేశారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న దుబాయ్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మన దేశ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం అని అన్నారు.


దుబాయ్ లో ఉన్న బీచ్ లు,  ఎడారి ప్రాంతాలు  పర్యాటకులకు ఆహ్లాద అనుభూతిని కలిగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.  అభివృద్ధి జరగాలంటే సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలని  కొత్తగా ఆలోచిస్తే మాత్రమే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. 1995 సంవత్సరంలో  టెక్నాలజీ  రివల్యూషన్ వల్ల అక్కడ పరిస్థితులు మారాయని  మన దేశం సైతం 2047 సంవత్సరం నాటికి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


గతంలో విజన్ 2020తో ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేశామని  వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో  క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఇప్పటికే రాష్ట్రంలో 575 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని  ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సమయానికి  ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని  చంద్రబాబు వెల్లడించారు.


ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు  కాయాల్సిన పరిస్థితి ఉండకూడదనే సేవలను సులభతరం చేసినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. పీపీపీ పద్దతిలో రహదారుల పనులు జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో దుబాయ్ లా అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉన్నతమైన లక్ష్యంతో చంద్రబాబు కష్టపడుతున్నారు.  పెట్టుబడి అవకాశాలు,  ఆర్థికాభివృద్ధి గురించి  ఇతర దేశాల ప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు నాయుడు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా  అమరావతిని ఇతర ప్రధాన నగరాలకు పోటీనిచ్చే స్థాయిలో నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: