మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో హల్ చల్ మొదలైంది. ఈ వార్తలకు కవిత ఒక పోస్టుతో సమాధానం ఇచ్చేసింది. కవిత తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టింది. అందులో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఓ ఆడియో ద్వారా తెలియజేసింది.

'గురుకుల పాఠశాలల శానిటేషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల రూ. 40,000 కేటాయించేది. స్లీపింగ్ కోసమే నలుగురు ఉద్యోగులు పనిచేసేవారు. టాయిలెట్లు కడగడం, తరగతి గదులు సైతం శుభ్రం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గురుకుల విద్యాసంస్థలలో కేర్ టేకర్ లను తొలగించారు. దాదాపు రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలో తొలగించారు. దాంతో 1200 మంది ఉద్యోగులకు జీవన ఉపాధి లేకుండా అయ్యింది. దానివల్ల స్వయంగా విద్యార్థులే శానిటేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం టాయిలెట్ గదులు మాత్రమే కాకుండా హాస్టల్ పరిసరాల్లో కూడా విద్యార్థులే నిత్యం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మొన్న ఈమధ్య కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు గురుకుల పాఠశాలలో ఓ వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు మెస్ పనులు కూడా చేసుకోవాల్సిన దుస్థితి కలుగుతోంది. శ్రమను గౌరవించడం నేర్పడం వేరు.. విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించడం వేరు. ఆడియోలో వర్షిని చెప్పినట్లు పిల్లలు టాయిలెట్లు కడగడం, బోర్డులు తుడవడమే కాకుండా టీచర్ల టాయిలెట్లను కూడా క్లీన్ చేయడం దారుణం. ఇది కచ్చితంగా శ్రమ దోపిడీ అని చెప్పొచ్చు. కుల వివక్ష కూడా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలందరూ ప్రభుత్వం దృష్టిలో సమానమే ఏ వర్గానికి చెందిన పిల్లలైనా సరే అందరూ ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల వివక్ష చూపిస్తోంది. ఈ ఆలోచనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి నెల పాఠశాలల మెయింటెనెన్స్ కోసం కచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. అలాగే పిల్లలతో పని చేయించడం ఆపేయాలి' అని కవిత రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: