అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండూ కలిసి వెళ్ళేవి. కొంతమంది ఏనుగులని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తరువాత వాటికి దారి తప్పామని అర్ధమయ్యింది. తిరిగి తిరిగి బాగా అలసి పోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతక సాగాయి.


కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళాయి. ఒక చోట గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాల దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు. ఆ గుంటలో నున్న నీళ్లు అన్నింటిని తాగినా ఒక ఏనుగుకు కూడా పూర్తిగా దాహం తీరదు.

అప్పుడు మొదటి ఏనుగు "ఈ నీటిని నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు"అని రెండో దానితో చెప్పింది రెండో ఏనుగు "కాదు కాదు నువ్వు తాగు నీకే ఎక్కువ దాహంగా ఉందని ఇందాక చెప్పావు కదా!"అని మొదటి దానితో చెప్పింది. చాలాసేపు 2 వాదించుకున్నాయి. చివరకు అవి 2 ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి. తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికీ గుంటలో నీళ్లు తగ్గటం లేదు.

ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న వాటిని వెతుకుతూ అక్కడకు చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి. కాసేపటి తరువాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు వీటిలో తొండాలు పెట్టాయి కానీ నీళ్లు తాగటం లేదు అని అర్థమయ్యింది. "మీరు ఎందుకు తాగటం లేదు"అని పిల్ల ఏనుగులను అడిగాయి. "నేను తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు."అని ఒకేసారి చెప్పాయి. "మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తున్నారు. స్నేహితులంటే ఇలాగే ఉండాలి"అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నా యి. కుంటలోని నీళ్లను చెరిసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: