ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై ఎవ‌రి వాద‌న‌ను వారు వినిపిస్తున్నారు. మ‌రోవైపు రాజ‌ధాని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. ఇలాంటి త‌రుణంలో కీల‌క ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. అమరావతి మహిళా జేఏసీ నాయ‌కురాలు, కాంగ్రెస్ నేత  సుంకర పద్మశ్రీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపారు. విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి రావడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా అంటూ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు.


ప్రధాని హోదాలోనే మోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారని పేర్కొన్న ప‌ద్మ‌శ్రీ మళ్లీ వైజాగ్‌లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారని క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు చేశారు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్నప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ, ఏపీ సీఎం జగన్ పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంఖుస్థాపనకు రావాలి అనుకుంటే అమరావతిలో మోదీ శంఖుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ల చేతులతోనే తీసేయాలని అమరావతి మహిళా జేఏసీ నాయ‌కురాలు డిమాండ్ చేశారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులంటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని సుంకర పద్మశ్రీ మండిప‌డ్డారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం మాకు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు ఎలా పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసర‌మ‌ని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ దూరంగా ఉంది కాబట్టి , రెండో  రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది ఉన్నందున అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన‌ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: