మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. సినీ పరిశ్రమకు ఊతమిచ్చేలా రెండు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. జనవరి 7వ తేదీన నందమూరి తారక రామారావు, రామ్ చరణ్, రాజ మౌళి కాంబోలో వస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వారం రోజులకు డార్లింగ్ ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యామ్ విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందినవే. పైగా ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా తరహాలో ఒకేసారి 5, 6 భాషల్లో విడుదల అవుతున్నాయి. వీటి కోసమే పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో వస్తున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలను ఏకంగా పది రోజుల పాటు పోస్ట్ పోను చేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని... జనవరి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇటీవలే యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ముంబై, చెన్నై నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఘనంగా నిర్వహించారు. రాధేశ్యామ్ కోసం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సినిమాల ప్రమోషన్ కూడా ప్రారంభమైంది.

అయితే ఈ సినిమాల విడుదలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ మాత్రమే. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 700 పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కూడా ఆదేశించారు. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ  అమలు చేస్తున్నాయి. అటు దేశ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేస్తోంది కేంద్ర హోమ్ శాఖ. ఇక ఢిల్లీ ప్రభుత్వం అయితే థియేటర్లు, మల్టీపెక్స్‌లపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఇదే జాబితాలో ఇతర రాష్ట్రాలు కూడా చేరనున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో బాలీవుడ్‌లో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. జెర్సీ హిందీ వర్షన్ సినిమా వాయిదా పడటంతో... ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పరిస్థితి ఏమిటన్నది అర్థం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: