మామూలుగానే జగన్మోహన్ రెడ్డంటే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెచ్చిపోతుంటారు. పార్టీ నేతల సమావేశమైనా, బహిరంగసభ అయినా జగన్ పై రెచ్చిపోవటం ఒకటే టార్గెట్. బోడిగుండుకు, మోకాలికి ముడేసి మరీ రెచ్చిపోతుంటారు. అలాంటిది అవకాశం దొరికితే వదిలిపెడతారా ? నెల్లూరు జిల్లా  వైసీపీలో జరుగుతున్న పరిణామాలను అడ్వాంటేజ్ గా తీసుకుని జగన్ కు వ్యతిరేకంగా గోల మొదలుపెట్టేశారు. అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్లుగా ఉంది పవన్ వ్యవహారం. అయినదానికి కానిదానికీ జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు కాబట్టే జనాలు నమ్మటంలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చేస్తున్న గోల అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు ఒక ఆధారం చూపించారు. అయితే ఎంఎల్ఏ చూపించిన ఆధారం అంత కన్వీన్సింగ్ గా లేదు. ఎంఎల్ఏ ఫోన్ ట్యాపింగ్ అంటుంటే మంత్రులు, మాజీ మంత్రులేమో ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అంటున్నారు. ఈ గొడవ ఇలాగుండగానే వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతు తన ఫోన్ కూడా ట్యాపవుతోందని అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
ఈ రెండింటిని పట్టుకుని పవన్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. ఆనం ప్రాణరక్షణ బాధ్యత డీజీపీనే తీసుకోవాలట. ఎంఎల్ఏలే ప్రాణహానితో భయపడే పరిస్ధితులు వచ్చాయంటు మండిపోయారు. అధికారపార్టీ ఎంఎల్ఏలకే ప్రాణహానుండి,  స్వేచ్చగా మాట్లాడుకోలేని పరిస్ధితులుంటే ఇక మామూలు జనాల పరిస్ధితి ఏమిటంటు నిలదీశారు. సొంత ఎంఎల్ఏల ఫోన్ సంభాషణలనే దొంగచాటుగా వినటమంటే పాలకుల్లోని అభద్రతా భావం అర్ధమవుతోందన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే ఎంఎల్ఏ ఫోన్ను ఎవరూ ట్యాప్ చేయలేదని మంత్రులు పదేపదే చెబుతున్నారు. అలాగే ఆనంకు ప్రాణహానంటే మంత్రులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎపుడూ తన ఫోన్ ట్యాప్ అవుతోందని, ప్రాణహాని ఉందని ఆనం చెప్పలేదు. నిజంగానే ట్యాపింగ్ జరుగుతు, ప్రాణాలకు హానుంటే ఆ విషయం ఆనం చెప్పకుండానే  ఉంటారా ? మొత్తానికి అధికారపార్టీ ఎంఎల్ఏలే జగన్ కు వ్యతిరేకంగా పవన్ కు మంచి ఆయుధాలిస్తున్నట్లు అర్ధమవుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: