ఉందిలే మంచి కాలం ముందూ ముందునా అనుకుంటూ టాలీవుడ్ చాలా కాలం గడిపేసింది. ఈ మధ్యలో దసరా వంటి బ్రహ్మాండమైన సీజన్లు కూడా కొట్టుకుపోయాయి. మొత్తానికి సంక్రాంతి మీద కన్నేసి డేట్స్ లాక్ చేసుకుని సంబరానికి రెడీగా ఉంది.

అన్నీ అనుకూలిస్తునాయి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ కి సందడి వచ్చింది అని అంతా సంతోషిస్తున్న నేపధ్యంలో ఒమిక్రాన్ రూపంలో గండం ముంగిట్లో పొంచి ఉంది. ఇపుడిపుడే ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్ కేసులు బాగా పెరుగుతున్నాయి. దీంతో ఒక అంచనా ప్రకారం చూస్తే కచ్చితంగా జనవరి నాటికి భారీగా నమోదు అవుతాయని అంటున్నారు. మరో వైపు థర్డ్ వేవ్ అని కూడా చెబుతున్నారు.

దాంతో మొదలై ఫిబ్రవరి నాటికి పీక్స్ కి కేసుల సంఖ్య చేరుకుంటుందని కూడా చెబుతున్నారు. దీంతో టాలీవుడ్ గుండెల్లో గుబులు చెలరేగుతోంది. ఏకంగా వేయి  కోట్ల రూపాయలు విలువ చేసే భారీ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ట్రిపుల్ ఆర్ మూవీయే అయిదు వందల కోట్ల ప్రాజెక్ట్ గా ఉంది.

అలాగే మూడు వందల కోట్ల ప్రాజెక్ట్ గా రాధేశ్యామ్ ఉంది. ఇక మిగిలిన మూవీస్ రెండు వందల కోట్లుగా ఉన్నాయి. ఇలా వేయి కోట్ల బిజినెస్ ని ముందు పెట్టుకుని టాలీవుడ్ సంక్రాంతి మీద కోటి ఆశలతో ఉంది. అలాంటి టైమ్ లో ఒమి క్రాన్ వచ్చి అన్నింటినీ చిదిమేస్తుందా అన్న చర్చ అయితే ఉంది. భగవంతుడి దయ వల్ల టాలీవుడ్ కి ఒమిక్రాన్ గండం లేకుండా ఉంటే సంక్రాంతికి గట్టెక్కేస్తామని చెబుతున్నారు. మరి ఒమిక్రాన్ నేపధ్యంలో కరోనా ప్రోటోకాల్ ఆంక్షలు కూడా లేకుండా ఉంటే మరీ మంచిదని కూడా వారు వేడుకుంటున్నారు. అంతా మంచే జరగాలని, ఓమిక్రాన్ ప్రభావం లేకుండా పోవాలని సినీ ప్రియులు కూడా ఆశిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: