కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఐదేళ్ల శిక్ష ఖరారైంది. సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన జోధ్ పూర్ కోర్టు.. ఐదేళ్ల శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు.. కేసులో మిగిలిన నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలంను నిర్దోషులుగా ప్రకటించింది. 1998 అక్టోబర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను వేటాడారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు కాగా.. సుమారు 20 ఏళ్ల పాటు విచారణ సాగింది. గత నెల 28న విచారణ పూర్తి చేసిన కోర్టు.. సల్మాన్ కు శిక్ష ఖరారు చేసింది. తీర్పు అనంతరం సల్మాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జోధ్ పూర్ జైలుకు తరలించారు..
ఈ కేసులో సల్మాన్ ఖాన్ మీద అటవీ సంరక్షణ చట్టం 9/51 సెక్షన్ల కింద కేసు నమోదయింది.సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష పడిన నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలకు దాదాపు 1000 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ భారత్, రేస్ 3, కిక్ 2, దబాంగ్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. రేస్ 3 సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జూన్ 15న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా విడుదలైతే.. సల్మాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’, ‘టైగర్ జిందా హై’ వసూళ్లను దాటుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సల్మాన్ చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ ‘భారత్’. ఈ సినిమా సల్మాన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పలుమార్లు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ వెల్లడించారు. ఇందులో సల్మాన్ ఐదు విభిన్నగెటప్లలో కనిపిస్తారట. ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.
సల్మాన్ నటిస్తున్న మరో చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సిరీస్‌లో వచ్చిన తొలి రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను కూడా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. సల్మాన్ చేస్తున్న నాలుగో ప్రాజెక్ట్ కిక్ 2 మూవీని క్రిస్మస్ కి విడుదల చేయాలనుకున్నారు. కిక్ లాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
హిందీలో సూపర్ పాపులర్ అయిన ‘బిగ్ బాస్' విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నరు. ఇటీవలే 11వ సీజన్ పూర్తయింది. త్వరలో 12 సీజన్ మొదలు కావాల్సి ఉంది. సల్మాన్ కు శిక్ష ఖరారైన నేపథ్యంలో.. వీటన్నిటి భవిష్యత్ ఏంటనేది తెలియాల్సి ఉంది.