
ఆయన ఓటమి తర్వాత.. ఆయన సోదరుడు కృష్ణుడు రంగ ప్రవేశం చేసినా.. ఫలితం దక్కలేదు. గత టీడీపీ హయాంలో ఇక్కడ నుంచి గెలవకపోయినా.. అన్నదమ్ములు ఇద్దరూ చక్రం తిప్పారు. అయితే.. వైసీపీ తరపున 2014లో విజయం దక్కించుకున్న దాడిశెట్టి రాజా వరుస విజయాలు అందుకున్నారు. టీడీపీ నేతలను కూడా ఆకర్షించారు. ఈ క్రమంలోనే యనమలకు చెక్ పెట్టేలా.. రాజకీయాల్లో దూకుడు కూడా పెంచారు.ఒకవైపు రాజకీయంగా పట్టుపెంచుకుంటూనే.. మరోవైపు.. నియోజకవర్గంలో టీడీపీని మరింత దెబ్బతీసే వ్యూహాలు వేస్తూ.. రాజా ముందుకు సాగారు. అయినప్పటికీ.. యనమల రామకృష్ణుడు.. వైసీపీ సర్కారుపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా ఉన్న యనమల.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి నాయకుడికి ముకుతాడు వేయాలని.. జగన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజాను మరింత ప్రోత్సహించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ కూర్పులో రాజాకు చోటు దక్కుతుందని.. చెబుతున్నారు. మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా తునిలో రాజాకు మరింత దన్ను వచ్చేలా చేయాలని.. జగన్ భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాజా దూకుడుగా ఉన్నారని.. రేపు మంత్రి అయితే.. యనమల రాజకీయాలకు ఆయన చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు.
ఇదే జరిగితే.. యనమల కుటుంబం నుంచి ఎవరు రంగంలోకి దిగినా.. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని చెబుతున్నారు. రాజా దూకుడుతో వరుస పరాజయాలు చవిచూస్తున్న యనమల కుటుంబానికి ఇప్పుడు రాజా మంత్రి అయితే.. మరింతగా పరిస్థితి తిరగబడే ప్రమాదం ఉందని.. టీడీపీ నేతలు కూడా గుసగుసలాడుతున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిగా.. దూకుడు ఉన్న నేతగా గుర్తింపు పొందిన రాజాకు మంత్రి పదవి దక్కితే.. ఇక, యనమల తన నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి రావచ్చని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని టీడీపీ నేతలు అంటుంటే.. వైసీపీ నాయకులు మరింత పుంజుకుంటామని సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.