ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగుస్తుండడంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారధి తరఫున ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా తన ప్రసంగంతో ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు ఈ బీజేపీ నేతలు. ఎక్కువగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అదే విధంగా ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన గళాన్ని వినిపించబోతున్నారు. తాండూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనను గురించి ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అనేకమంది హాజరుకానున్నారు. అలాగే కడపలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారనే విషయం తెలిసినదే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ సమాధికి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ఆ తరువాత కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద పుత్తా ఎస్టేట్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మే 11 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి సాయంత్రం 6 వరకూ సైలెన్స్ పీరియడ్ గా పరిగణించబడుతుంది. దాంతో ఈ రోజు సాయంత్రం 6 తరువాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుడదు. అదేవిధంగా బల్క్ SMS లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు అంటున్నారు కాబట్టి మీకు పిచ్చి పిచ్చి మెసేజులు వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయినట్టు సమాచారం. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఓటర్ స్లిప్పులను మాత్రమే పంపిణీ చేయాలని అభ్యర్థులను ఆదేశించింది ఈసీ.


మరింత సమాచారం తెలుసుకోండి: