ఐపీఎల్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మహా పోరుకు వేదిక కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ నాలుగో ఐపీఎల్ ఫైనల్‌కు కాలు దువ్వుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ జూన్ 3న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ముంబై ఇండియన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్, టైటిల్ కోసం ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది.

బెంగళూరు జట్టు ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ, ఈసారి ఎలాగైనా టైటిల్ పట్టాలని పట్టుదలగా ఉంది. అయితే, ఫైనల్ వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ రికార్డు మీకు తెలుసా?

ఆర్సీబీ ఇప్పటివరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడింది. అందులో 3 గెలిచి, 3 ఓడిపోయింది. ఇక ఈ వేదికపై ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఖాతాలో కేవలం ఒకే ఒక్క విజయం ఉంది.

అయినప్పటికీ, ఈ సీజన్‌లో ఆర్సీబీ చాలా పటిష్టంగా కనిపిస్తోంది, అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దుమ్మురేపుతూ వరుస విజయాలు అందుకుంటోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఎవరో ఒకరు కొత్త హీరోలా ఉద్భవిస్తున్నారు.

ఈ స్టేడియంలో "కింగ్" విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అందరి కళ్లూ ఉండనున్నాయి. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, పరుగుల వరద పారిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

నరేంద్ర మోదీ స్టేడియంలో విరాట్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి, రెండు హాఫ్ సెంచరీలతో సహా 219 పరుగులు చేశాడు. ఈ వేదికపై అతని సగటు 54.75 కాగా, స్ట్రైక్ రేట్ 139 గా ఉంది. అందువల్ల, ఫైనల్‌లో విరాట్ కోహ్లీ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ 2025తో కలిపి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. తొలిసారిగా 2009లో ఫైనల్‌కు చేరి, అక్కడ డెక్కన్ ఛార్జర్స్ చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2011లో తమ రెండో ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక 2016లో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హోరాహోరీ పోరులో, తమ మూడో ఐపీఎల్ ఫైనల్‌లో 8 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ బరిలో నిలిచింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో, ఈ మ్యాచ్ వారికి అత్యంత కీలకంగా మారింది. ఈసారి విరాట్ కోహ్లీ సేన కప్పు గెలిచి, సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానుల్లో గట్టి నమ్మకం ఉంది.

ఆర్సీబీ ఫ్యాన్స్ జూన్ 3 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చరిత్రను తిరగరాయాలనే లక్ష్యంతో ఆర్సీబీ నరేంద్ర మోదీ స్టేడియంలో అడుగుపెట్టనుంది. ఈసాల కప్ నమ్‌దే అంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: