దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. భారత్ లో ‘కర్తవ్య నిర్వహణకు లంచం’ అని. లంచగొండితనం, అవినీతిపై తీసిన ఆ సినిమా ఇప్పటికీ ఓ సంచలనం. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ కూడా లంచం వ్యవస్థపై సంధించిన అస్త్రమే. కానీ.. వ్యవస్థల్లో మార్పు వచ్చిందా అంటే.. ప్రశ్నార్ధకమే..! ఇప్పుడు లంచం, అవినీతిపై దర్శకుడు పూరి జగన్నాధ్ తన పూరి మ్యూజింగ్స్ లో చెప్పుకొచ్చాడు. దేశం మొత్తం లంచాలపైనే నడుస్తుందనే అర్ధంతో తన స్టయిల్లో చెప్పుకొచ్చాడు. మొత్తంగా ‘లంచం తీసుకునేవాడు మగాడు’ అనేశాడు.

లంచం అనే వ్యవస్థ మొదలయ్యేది మన ఇంట్లో పిల్లాడితోనే మొదలవుతుందనీ.. తల్లే తన కొడుక్కి లంచం గురించి పరిచయం చేస్తుందన్నాడు. ఇంట్లోకి సరుకులు తీసుకురమ్మంటే ‘నాకేంటి..’ అని కొడుకు అడగటం ఆ తల్లి డబ్బులు ఇవ్వడంతోనే లంచం వ్యవస్థ ప్రారంభమవుతుంది అన్నాడు. ఆ పిల్ల వెధవే పెద్దయ్యాక ఓ ఆఫీసర్ అయ్యి మనల్ని దోచేస్తాడు. తల్లినే వదలని వాడు మనల్ని ఎందుకు వదులుతాడు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనుక అవినీతి, ప్రతి ఓటు వెనుక లంచం ఉంటుంది. నిజాయితీగా ఉన్నవాడు చేతకానివాడిగా మిగిలిపోతే.. అవినీతి చేసేవాడు మగాడిగా నిలబడుతున్నాడు. అవినీతి రంగు ఎరుపు.. అది మన రక్తంలో కలిసిపోయింది.. అని చెప్పుకొచ్చాడు.


అవినీతి చేసారంటే ఆవేశంతో ఊగిపోయేవాడ్ని.. అదే పోస్టులో పెడితే అంతకంటే ఎక్కువ చేస్తాడు. ప్రతి మనిషి అవినీతి చేస్తాడు.. మనలో మనమే గుర్తించం. ఏదైనా కావాలని దేవుడికి మొక్కి.. ఇది సమర్పిస్తాను అని చెప్పి దేవుడికి కూడా లంచం ఇస్తున్నాం. ఇలా ప్రతిచోటా లంచం, అవినీతి పేరుకుపోయింది.. అని తనదైన పద్ధతిలో చెప్పాడు. నిజాలు నిష్టూరంలా ఉంటాయి.. అనే సామెతలా పూరి మాటలకు వ్యూవర్ షిప్ పెరగడానికి కారణం ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: