సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి క్యూ కడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 2026 సంక్రాంతికి పోటీ భారీగా పెరుగుతోంది. మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేశారు. `విశ్వంభ‌ర‌` వీఎఫ్‌ఎక్స్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టనున్న నేపథ్యంలో చిరు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పండ‌క్కి రానుంద‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఇటీవల టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నట్టు కన్ఫామ్ చేశాడు. ఈయన హీరోగా `అనగనగా ఒక రాజు` అనే సినిమా తెర‌కెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారి డైరెక్టర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుందని కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేశారు.


ఇక తాజాగా సంక్రాంతి రేసులో మరో స్టార్ హీరో చేరాడు. ఆయన మరెవరో కాదు రవితేజ. `మాస్ జాత‌ర‌` విడుదలకు ముందే కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వంలో తాజాగా రవితేజ `ఆర్టీ76` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ ప్రారంభించాడు. `అనార్కలి` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే వ‌చ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా తమ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. దీంతో సంక్రాంతి రేసులో మూడు చిత్రాలు రావడం కన్ఫార్మ్‌ అయ్యాయి. వీటితో పాటుగా ఇంకెన్ని చిత్రాలు పోటీకి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: