పోలింగ్ రోజున మొదలైన గొడవలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఎన్నికల గురించి తన్నుకోవడం, గొడవలు పడటం.. లేదా భౌతికంగా దాడులు చేయడం ఇదంతా ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే… ఈ గొడవల వల్ల సాధించేది ఏమీ ఉండదు. పైగా పోలీస్ కేసులు, ఆసుపత్రి బిల్లులు బోనస్. కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి నష్టపోతే ఆ జీవితాన్ని ఎవరు ఇస్తారు. ఇవన్నీ ఒక్క క్షణం ఆలోచించాలి.
మరోవైపు కేసులతో వాయిదాలతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రశాంతత ఉండదు. మనిషి ముందు హీరోలు అని కీర్తిస్తారు. వెనుక మాత్రం రౌడీ షీటర్, దుర్మార్గుడు అని తిడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల కోసం మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. పొద్దున లేచి చూస్తే పొరుగింటి వారి అవసరం నీకు ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థి పార్టీ అని ఆయనతో గొడవ పడితే నీకు ఆపత్కాల సమయంలో ఎవరు సాయం చేస్తారు.
బాబాయ్, మామయ్యా, చిన్నమ్మ అంటూ అప్పటి వరకు ఆప్యాయంగా పిలుచుకున్న పిలుపులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజకీయాలు రాజకీయానికి మాత్రమే పరిమితం కావాలి. వ్యక్తిగత అంశాల జోలికి పోకూడదు. ఇప్పుడు ఎన్నికలు ఎలాగూ అయిపోయాయి. ఇప్పుడు నీవు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు బంధువులు, స్నేహితులు, తోటి వారితో పార్టీ విషయంపై భేదాబిప్రాయాలు రావొచ్చు. వాటిని మరిచిపోండి. అన్నింటిని వదిలేయండి. ఇది వరకు లా అందరి ఇళ్లకు వెళ్లి మంచి చెడూ మాట్లాడుకోండి. ఆప్యాయంగా పలకరించుకోండి. రాజకీయాల గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. మీ స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు గుర్తు చేసుకొని.. వాటిని సరిచేసుకోండి.