ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు వీడియో పాఠాలు అందిస్తోన్న ప్రభుత్వం ఆడియో పాఠాలు అందించేందుకు సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ సహాయ సహకారాలతో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచే ఆడియో పాఠాలను ప్రసారం చేయనుంది. రాష్ట్రంలో కరోనా వల్ల పదో తరగతి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కరోనా విజృంభించడంతో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యాసంస్థలు మూతబడటంతో విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. సర్వశిక్షా అభియాన్ అధికారులు దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 15 వరకు పాఠాలు ప్రసారం కానున్నాయి. 
 
ప్రతిరోజూ ఉదయం 11.05 నిమిషాల నుంచి 11.35 నిమిషాల వరకు ఆడియో పాఠాలు ప్రసారం కానున్నాయి. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు తెలుగు, ఏప్రిల్ 22 నుంచి 25 వరకు హిందీ, ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు ఇంగ్లీష్, మే 2 నుంచి 5 వరకు మ్యాథ్స్, మే 6 నుంచి 8 వరకు ఫిజిక్స్, మే 9 నుంచి 11 వరకు నాచురల్ సైన్స్, మే 12 నుంచి 15 వరకు సోషల్ స్టడీస్ ప్రసారం కానున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో పదో తరగతి పరీక్షలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మే 3వ తేదీలోపు రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తే మాత్రమే ప్రభుత్వం పరీక్షల దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరోవైపు కరోనా ప్రభావం వల్ల వచ్చే విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: