ఫోన్‌ ట్యాపింగ్.. తెలంగాణలో కొన్ని రోజులుగా పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన అంశమిది. కేసీఆర్‌ సర్కారు విపరీతంగా ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడిందని.. అప్పట్లో విపక్ష నేతల ఫోన్లన్నీ ట్యాప్‌ చేసి.. వారు ఏం మాట్లాడుకుంటున్నారో నిఘా పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. కేవలం విపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలపై కూడా కేసీఆర్‌ నిఘా పెట్టారని.. అందుకే ఈటల వంటి వారిని పార్టీ నుంచి పంపేశారనే విమర్శలు ఉన్నాయి.


ఈ విమర్శలపై తాజాగా టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అన్నది పోలీసు విభాగం పని అంటూ వారిపై నెట్టేసిన కేసీఆర్‌.. అందులో తమకు పాత్ర లేదని చెప్పుకొచ్చారు. ఏ ఫోన్‌ ట్యాప్‌ చేయాలో.. ఏది చేయకూడదో పోలీసులు, హోం శాఖ చూసుకుంటాయని సీఎంగా తాను ఏ ఫోన్‌ ట్యాప్‌ చేయాలో చెప్పలేదని కేసీఆర్‌ అంటున్నారు. అదే సమయంలో తాను ఎవరి ఫోన్‌ ట్యాప్‌ చేయించలేదని కుండబద్దలు కొట్టి చెప్పడం లేదు. పోలీసులు చాలా మందివి చేసి ఉంటారు. అది వారి డ్యూటీలో భాగం అంటూ తప్పించుకునేలా మాట్లాడారు.


అంతే కాదు.. ఇప్పటి ప్రభుత్వం మాత్రం ట్యాపింగ్‌ చేయట్లేదా.. ఈ సీఎంకు రిపోర్టులు రావడం లేదా.. ఇది చాలా సహజమైన ప్రక్రియ అన్నట్టు మాట్లాడారు. తమను బద్‌నామ్‌ చేసేందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్‌ నుంచి కొన్న పరికరాలతో ట్యాపింగ్‌ చేయించారా అని అడిగితే.. అదంతా పోలీసు డిపార్ట్‌మెంట్‌ చూసుకుంటుందని.. ఎక్కడ ఏమేం కొనుక్కొచ్చారో మాకెలా తెలుస్తుంది అంటూ ఎదురు ప్రశ్నించారు.


కేసీఆర్ మాటలు వింటే.. పోలీసు డిపార్ట్మెంట్‌ చాలా స్వతంత్ర్యంగా పని చేసినట్టు.. వారి విధుల్లో తామేమీ జోక్యం చేసుకోనట్టూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద తాము ట్యాపింగ్ చేయించామని కేసీఆర్‌ చెప్పకుండానే పరోక్షంగా ఒప్పేసుకున్నారు. అంతే కాదు.. రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని ఎదురుదాడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: