
తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. జవాద్ తుపాను ప్రభావం ఈ సాయంత్రం నుంచే ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. నెమ్మదిగా తీరం వైపు పయనిస్తున్న తుపాను... వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణిస్తుందని... రేపు ఉదయం తీరం చేరే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నారు. జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ పరిధిలో రెండు రోజుల పాటు మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ మీదుగా ప్రయాణించే 41 రైళ్లను కూడా నిలిపివేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. సముద్రంలో అలలు ఎగసి పడతాయనే హెచ్చరికల నేపథ్యంలో తీరంలో లంగం వేసిన బోట్లను మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విలువైన వలలు, ఇతర సామాగ్రిని తుఫాన్ షెల్డర్లకు తరలించారు మత్స్యకారులు.