హైదరాబాద్ బతుకమ్మకుంటలో ఈసారి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు కబ్జా అయిన ఈ చెరువును ప్రభుత్వం సంరక్షించి, పునరుద్ధరించి “బతుకమ్మకుంట”గా మలచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో రేవంత్ ప్రసంగిస్తూ చెరువుల పరిరక్షణపై తన ప్రభుత్వ వైఖ‌రిని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి సినీ నటుడు అక్కినేని నాగార్జున పేరును ప్రస్తావించారు. తుమ్మడికుంటపై అక్రమ కబ్జా జరిగి, అక్కడే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని రేవంత్ తెలిపారు. “ అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరితే, మొదట నాగార్జున స్పందించలేదు. అప్పటి బీఆర్ఎస్ నేతలతో సాన్నిహిత్యం ఉండటమే కారణమని అనిపించింది ” అని ఆయన వ్యాఖ్యానించారు.


తరువాత తప్పును గ్రహించిన నాగార్జున, ఆదర్శంగా ఉండాలని నిర్ణయించి రెండు ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారని రేవంత్ వెల్లడించారు. చెరువుల సంరక్షణలో తాను సహకరిస్తానని నాగార్జున హామీ కూడా ఇచ్చారన్నారు. ఈ పరిణామం వల్ల ఎన్ కన్వెన్షన్‌తో పాటు తుమ్మడికుంట వివాదం పెద్ద సమస్యగా మిగలకుండా పరిష్కారం దొరికింద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్‌లో లగ్జరీ ఈవెంట్లకు కేంద్రంగా ఉండేది. అయితే అది చెరువు నీటి ప్రవాహానికి అడ్డుగా నిలిచిందన్న‌ విమర్శలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని తొలగించి, ఆ భూభాగాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా వివాదం ముగిసింది. లేకపోతే అది ఎప్పటికీ చెరువు ఆక్రమణ కేసులలో ఒకటి గా మిగిలిపోయేదని రేవంత్ గుర్తు చేశారు.


అయితే, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడం, నాగార్జునకు మాత్రం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంద‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. అయిపోయిన విష‌యాన్ని రేవంత్ ప‌దే ప‌దే తేనెతుట్టెను క‌దిపిన‌ట్టు క‌ద‌ప‌డం స‌రికాద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: