నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే పోలేరమ్మ జాతర ఆ పట్టణ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక వేడుక. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ జాతరలో స్థానికుల విశ్వాసం, సాంప్రదాయం, సంస్కృతి స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. ఈ జాతర కేవలం ధార్మిక ఉత్సవం మాత్రమే కాదు, ఆ ప్రాంత చరిత్ర, ఆచారాలు, భక్తి పరంపరలను గుర్తు చేసే ప్రత్యేక సందర్భం. పోలేరమ్మను గ్రామదేవతగా పూజిస్తారు. పాతకాలంలో వ్యాధులు, కష్టాలు, సహజ విపత్తుల నుండి ప్రజలను రక్షించాలనే నమ్మకంతో పోలేరమ్మ అమ్మవారిని ఆరాధించడం మొదలైంది. ఆమెను సర్వ శక్తుల సమాహారంగా భావించి, గ్రామానికి శాంతి, సుఖశాంతులను కాపాడే అమ్మవారిగా గుర్తిస్తారు. వెంకటగిరి పట్టణానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ ప్రాంతంలో పాలించిన వెంకటగిరి రాజులు ఈ జాతరను ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని స్థాపించారు. పోలేరమ్మ ఆలయ నిర్మాణం రాజుల కాలంలోనే పూర్తి కాగా, అప్పటినుంచి ప్రతి సంవత్సరం శ్రావణం-భాద్రపద మాసాల్లో జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో పూజలు, వ్రతాలు, సాంప్రదాయ కార్యక్రమాలు రాజమర్యాదలతో జరుగుతుంటాయి.


ఎందుకు జరుపుకుంటారు?

పోలేరమ్మ జాతరను గ్రామ రక్షకురాలు పోలేరమ్మ తల్లికి కృతజ్ఞతగా జరుపుతారు. పాతకాలంలో పంటలు పుష్కలంగా పండడం, కరువులు, వ్యాధులు దరిచేరకుండా ఉండడం కోసం గ్రామస్తులు ఈ జాతరను ప్రతీ సంవత్సరం నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఉత్సవం గ్రామ ఐక్యతకు, సాంప్రదాయ పరిరక్షణకు సంకేతంగా నిలుస్తోంది. 1913వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాపించి భారీ ప్రాణ నష్టం సంభవించింది అని పెద్దలు చెప్తూ ఉంటారు.వెంకటగిరి సంస్థానాధీశులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించారట. ఏటా జాతర నిర్వహిస్తామని పోలేరమ్మకు మొక్కుకున్నారట.



యాగానంతరం ఆ రాళ్లను  రాజులు ఊరి పొలిమేరల్లో పూజలతో ప్రతిష్టించారు. ప్రస్తుతం పట్టణంలో నిత్యం పూజలందుకుంటున్న శిలకూడా నాడు ప్రతిష్టించిన శీతల రాళ్లలో ఒకటి అని అక్కడ జనాలు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి  ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో కలరా సోకలేదని .. అప్పట్నుంచీ వెంకటగిరి సంస్థానాధీశుల ఆద్వర్యంలో పోలేరమ్మ జాతరను ఏటా వైభవంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది అనేది అక్కడ ఉన్న ప్రజలు చెప్తుంటారు. వినాయక చవితి తర్వాత వచ్చే బుధవారం రాత్రి 12 గంటల తర్వాత జాతరకు మొదటి చాటింపు వేస్తారు.



మళ్లీ బుధవారం రెండో చాటింపు వేస్తారు. ఇక ఆ తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి ఘటోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. గాలిగంగల మండపంలో రెండు పచ్చి కుండలను వుంచి పూజలు చేశాక పోలేరమ్మ అత్తగారి నివాసమైన చాకలివీధి వద్దకు తరలిస్తారు. హై సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తూ ఇస్తారు. ఆ కుండల్లో భక్తులు అంబళ్లు పోశాక డప్పు వాయిద్యాల నడుమ బాణాసంచా వెలుగుల మధ్య ఘటాలను ఊరేగింపుగా వెంకటగిరి పట్టణ నడిబొడ్డున వున్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ ఆలయానికి తీసుకు వచ్చి  అక్కడ పూజారులకి అర్చిస్తారు. ఇక తరువాత ఆ కుండలను వెంకటగిరి రాజభవంతికి తీసుకు వస్తారు. ఇదే ఇక్కడ గూస్ బంప్స్ మూమెంట్.

 

అక్కడ రాజవంశీకులు తమ పరివారంతో కలిసి కుండలకు ప్రధమ పూజలు నిర్వహిస్తారు. అది ఓ సాంప్రదాయంలా తరతరాలుగా ముందుకు వెళ్తుంది. అలా ఘటోత్సవంతో ప్రతి ఇంటా జాతర సందడి మొదలవుతుంది. అనంతరం రెండు రోజుల పాటు జాతరను చాలా ఘనంగా  నిర్వహిస్తారు.పోలేరమ్మ ఊరేగింపు సందర్భంగా వెంకటగిరి పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. బుధవారం సాయంత్రం అమ్మావరి బొమ్మను చేసి పెడతారు. అప్పుడు అమ్మవారికి కళ్ళు పెట్టరు. ఆ తరువాత బుధవారం రాత్రి కళ్లు పెట్టి సర్పరం పై ఊరేగిస్తారు.



అలా ఊరేగింపు పోలేరమ్మ గుడి వద్దకు వచ్చి ఆగుతుంది. ఇక బుధవారం రాత్రి నుండి గురువారం సాయంత్రం వరకు అక్కడే అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు. గురువారం తెల్లవారుజామున గుడివద్దకు చేరుకోగానే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.రాజకుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిదులతో అమ్మవారి ఆలయం సందడిగా మారుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు దున్నపోతును బలి ఇస్తారు. అనంతరం నూనె దీపంతో చేతపట్టిన రజకుడిని వీధుల్లో తిప్పుతారు. దీపం ఆరిపోకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.బలి ఇచ్చిన దున్నపోతు రక్తంతో తయారుచేసిన అన్నాన్ని పొలిమేరల్లో చల్లుతారు.పొలి పూర్తయిన వెంటనే పోలేరమ్మ ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఊరేగింపు కౌవల్యానది తీరానికి చేరుకోగానే అమ్మవారి కళ్లను, చేతులను తొలగిస్తారు. పోలేరమ్మ విగ్రహం విరూప మండపానికి పోగానే  ఆ మట్టిని భక్తులు పోటీపడి పట్టుకెళతారు. ఈ మట్టిని ఇంటిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో పోలేరమ్మ జాతర ముగుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: