
ఆయుర్వేదం ప్రకారం, అల్లం ఒక శక్తివంతమైన మూలిక. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు అల్లం ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మరింత మేలు జరుగుతుంది. కానీ దీన్ని అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
అల్లంలో ఉండే సహజ ఎంజైమ్స్, జింజెరోల్ జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తాయి. దాంతో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఖాళీ కడుపుతో అల్లం రసం లేదా అల్లం టీ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి.
అల్లం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే అల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి. అల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో క్యాలరీలను వేగంగా ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే గోరు వెచ్చని అల్లం టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల బరువు తగ్గుతారు.
అల్లం ముఖ్యంగా గర్భిణుల్లో వచ్చే ఉదయం వికారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం ఎక్కువగా తీసుకుంటే ఛాతీలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అసిడిటీ సమస్య ఉన్నవారు అల్లం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అల్లం రక్తాన్ని పల్చగా చేస్తుంది. అందుకే రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి మందులు తీసుకునేవారు వైద్యుడిని సంప్రదించాలి.
మొత్తంగా, ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దాన్ని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఏ ఆరోగ్య సమస్యలకైనా, ముఖ్యంగా మందులు తీసుకుంటున్నప్పుడు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మందులతో అల్లం ప్రభావం ఉండవచ్చు.