భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా సేవలందించిన నాయకుల్లో ఆయన ఇప్పుడు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉండగా, జూలై 25వ తేదీ నాటికి మోదీ 4,078 రోజులు పూర్తి చేసుకొని ఆమెను ఒక రోజు అధిగమించారు. ఇందిరా గాంధీ మొత్తం 4,077 రోజులు ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం దేశానికి అత్యధికకాలం సేవలందించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ (6,130 రోజులు) అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఘనత మోదీకి అనేక కోణాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాయకుల్లో దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న తొలి వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కారు. అంతేకాదు, కాంగ్రెస్ ఇతర రాజకీయ నేతగా దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు.
 

2014లో ప్రధాని పదవిలోకి అడుగుపెట్టిన మోదీ, 2019లో మరోసారి పూర్తి మెజారిటీతో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇదే విధంగా వరుసగా రెండు సార్లు పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించిన నాయకుడిగా ఆయన పేరు మ‌రో ఘనతను అందుకుంది. ఇందిరా గాంధీ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు. మోదీ కేవలం కేంద్ర రాజకీయాల్లోనే కాక, రాష్ట్ర రాజకీయాల్లోనూ అపూర్వ విజయాలు సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు వరుసగా గెలిచి, రాష్ట్ర అభివృద్ధికి శ్రేష్ట నాయకత్వాన్ని అందించారు. అటుపై దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి, విజయాలతో నిండిన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కలిపి 6 సార్లు వరుసగా పార్టీని గెలిపించగలిగిన అరుదైన నాయకుడిగా మోదీ పేరు మరింత వెలిగిపోతోంది.


ఆరెస్సెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మోదీ, అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశపు ప్రధాన నాయకుడిగా మారారు. ఎల్.కె. అద్వానీ చేపట్టిన రథయాత్ర, మురళీమనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అభివృద్ధి, సంస్కరణలతో భారతదేశాన్ని కొత్త దిశగా నడిపించారు. ఈ రోజు ఆయన సాధించిన మైలురాయి, నరేంద్ర మోదీని ఇండియా పాలిటిక్స్‌లో చిరస్థాయిగా నిలిపే ఘట్టంగా చెప్పుకోవచ్చు. మరింతగా ఈ ఘనతలు కొనసాగుతూ, దేశాభివృద్ధికి పునాది రాయిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: